అరుణ్ జైట్లీ మాట అంతా అసత్య ప్రచారమేనా?

0
14

ఒక అసత్యాన్ని పదిమార్లు పలకడం ద్వారా నిజమే అని నమ్మించగల సిద్ధహస్తులు మోడీ సర్కార్లో పుష్కలంగానే ఉన్నారు. కనుల ముందు పందిని చూపించి అది నంది అని మనం ఒప్పుకునేలా చేయగల సమర్థులు వాళ్లు. అలాంటి వారిలో ఇప్పుడైతే కేంద్రం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా ముందువరుసలోనే నిలబడేలా కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దు అనేది సాధించినవి ఎంత నీచమైన సత్ఫలితాలో అందరూ చూస్తూనే ఉన్నారు.

కానీ ఆ నిర్ణయం పుణ్యమాని దేశవ్యాప్తంగా సామాన్య జనజీవితం ఎంతగా అతలాకుతలం అయిందో అందరికీ తెలుసు. అయితే విదేశీ గడ్డమీదకు వెళ్లి.. పెద్దనోట్ల రద్దు పుణ్యమాని సాధించిన సత్ఫలితాలు అంటూ అరుణ్ జైట్లీ ఏకరవు పెట్టిన విషయాలు… అంతా డొల్లేనని, బొంకులేనని తాజాగా కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల సాక్షిగా తేలిపోతోంది.

నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నప్పుడు మోడీ సర్కారు.. దీనివలన నల్లధనానికి కత్తెర వేసేయడం కుదురుతుంది అంటూ ప్రగల్భాలు పలికింది. తీరా కొత్తనోట్లు వచ్చిన తరువాత పరిణామాలను గమనిస్తూపోతే.. నల్లధనం మొత్తం పాతనోట్ల రూపంలోంచి కొత్తనోట్ల రూపంలోకి మారిందే తప్ప.. ఎక్కడా అది బయటపడలేదనే సంగతి తేలిపోయింది.

కానీ ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తే ప్రజలు, అవస్థలు పడిన యావత్ దేశం తమను ఛీత్కరించుకుంటుందేమో అని భావించిన మోడీ సర్కార్.. కేవలం నల్లదనం మాత్రమే నోట్లరద్దు ప్రయోజనం కాదని.. ఉగ్రవాదం కూడా తగ్గుముఖం పడుతుందని.. దేశంలో పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాదులకు నల్లధనం అందుతోందని.. నోట్లరద్దు వలన వారి ఆటలకు చెక్ పెట్టినట్లు అవుతుందని రకరకాల కబుర్లు చెప్పింది.

ఇటీవల అమెరికా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదేమాట చెప్పారు. నోట్లరద్దు తర్వాత కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిపోయిందని… అక్కడి అల్లరిమూకలు రాళ్లురువ్వడం తగ్గిపోయిందని అన్నారు. కానీ తాజా దాఖలాలు గమనిస్తోంటే.. కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గడం కాదు కదా.. మరింతగా శృతిమించిపోయిందని అనిపిస్తోంది.

ఉగ్రవాదులు లేదా వారి మద్దతుదారులు రాళ్లు రువ్వడం మానేసి బుల్లెట్లు బాంబులు రువ్వుతున్నారని అనిపిస్తోంది. తాజాగా ప్రతిరోజూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. నోట్లరద్దు వలన ఉగ్రవాదం తగ్గిందనే అరుణ్ జైట్లీ మాటలు ఇంత స్వల్పకాలంలోనే అసత్యాలుగా తేలిపోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

కాశ్మీర్లో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెచ్చుమీరడాన్ని మనం గమనించవచ్చు. ఈ ఏడాదిలో జూన్ నుంచి లెక్క తీస్తేనే కాస్త భారీ ఉగ్రదాడులుగా చెప్పుకోదగినవి ఎనిమిదికి పైగా చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 15మంది జవాన్లు గాయపడగా, మరో 16మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఉగ్రదాడుల్లోనే మరణించిన అమాయక పౌరుల సంఖ్య 9 కాగా, 30 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.

ఏకంగా హోంమంత్రి రాజ్ నాథ్ పాల్గొన్న కార్యక్రమ వేదికకు 500 మీటర్ల దూరంలో కూడా ఉగ్రదాడికి పాల్పడి తమ ఉనికిని వారు చాటుకుంటున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా.. అరుణ్ జైట్లీ నోట్లరద్దు వలన.. ఉగ్రవాదం చచ్చిపోయిందంటూ.. విదేశాలలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.