ఏపీ సీఎం జగన్ పై ఆర్జీవీ ఎటాక్.. టైటిల్ పాత్రధారి ఎవరు?

ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే రెండు భాగాల సిరీస్ ని కూడా ప్రకటించేశారు. మొదటి భాగానికి వ్యూహం- రెండో భాగానికి శపథం అనే టైటిల్స్ ని ఫిక్స్ చేసారు.

తాజాగా చిత్రీకరణ ప్రారంభమైందని హింట్ ఇస్తూ ట్విట్టర్ లో ఆన్ లొకేషన్ ఫోటోలను కూడా ఆర్జీవీ షేర్ చేయడంతో ఆల్మోస్ట్ క్రేజీ ఫ్రాంఛైజీ ఖరారైంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా .. వైయస్ భారతిగా ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? అన్న ప్రశ్నకు కూడా ఆర్జీవీ స్పష్ఠమైన సమాధానం ఇచ్చేశాడు.

గతంలో ఆర్జీవీ తెరకెక్కించిన ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ లో వైయస్ జగన్ పాత్రను పోషించిన తమిళ నటుడు అజ్మల్ అమీర్ ‘వ్యూహం’లోను జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వైఎస్ భారతి గా మానస రాధా కృషన్ నటిస్తున్నారు. ఆ ఇద్దరికి సంబంధించిన లుక్స్ ని రిలీజ్ చేయగా వర్మ సెలెక్షన్ వందశాతం పర్ఫెక్ట్ అంటూ పొగిడేస్తున్నారంతా. ఈ రెండు సినిమాలకు ‘వంగవీటి’ ఫేం దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇంతకీ ఏపీ రాజకీయాల్ని వైయస్ జగన్ ని టార్గెట్ చేస్తూ వర్మ ఈ సినిమాల్ని తెరకెక్కిస్తున్నారా? అన్నదానికి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టి లో ఉంచుకునే వర్మ ఏదో ఒక సంచలనం కోసం పాకులాడుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది.

గతంలో చంద్రబాబు నాయుడును ఆయన కుమారుడిని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ అప్పట్లో అది హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబును.. పవన్ ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ సినిమాలు తీసారు. ఇప్పుడు వైయస్ జగన్ టార్గెట్ గా సినిమా తీస్తుండడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిస్తోంది.