కమల్‌, రజనీ ‘విచిత్ర స్నేహితులు’

0
10

కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ మంచి స్నేహితులు. ఈ విషయం అందరికీ తెల్సిందే. అయితే, అప్పుడప్పుడూ ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఘాటైన సెటైర్లు వేసుకుంటుంటారు. అలాంటి సెటైర్లు పడినప్పుడు మాత్రం ఇద్దరూ బద్ధశతృవుల్లా అనిపిస్తుంటారు. అయితే, ‘మీ ఇద్దరి మధ్యా వైరానికి కారణమేంటి.?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘స్నేహం వున్న చోట వైరానికి తావు లేదు..’ అని సమాధానమిస్తుంటారు కమల్‌, రజనీ. అందుకే, ఈ ఇద్దరి స్నేహం ఎప్పుడూ ఎవరికీ అర్థం కాదు.

తమిళ రాజకీయాల్లోకి ఇటు కమల్‌, అటు రజనీ ఎంట్రీ కోసం చూస్తున్నారు. కమల్‌హాసన్‌ క్లారిటీ ఇచ్చేశాడు, త్వరలో పార్టీ పెట్టబోతున్నాడు కూడా. రజనీకాంత్‌ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడింకా. ‘కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్‌ కనిపిస్తాడు..’ అని మొన్నామధ్యన ఓ సందర్భంలో రజనీకాంత్‌ మీద కమల్‌ సెటైర్‌ వేయడంతో, ఇది రాజకీయ దుమారానికి కారణమయ్యింది. రజనీ పొలిటికల్‌ ఎంట్రీకి కమల్‌ ఝలక్‌ ఇచ్చాడని అంతా అనుకున్నారు.

టైమ్‌ చూసి కమల్‌పై రజనీకాంత్‌ కూడా సెటైర్‌ వేసేశాడు. ‘రాజకీయాల్లో రాణించడమంటే అంత ఈజీ కాదు.. పార్టీ పెట్టేస్తేనే గెలుపు కాదు.. ఆ గెలుపు కిటుకు ఏంటో కమల్‌కి మాత్రమే తెలిసినట్టుంది.. నేను అడిగినా ఆ కిటుకుని కమల్‌ చెప్పడేమో..’ అంటూ రజనీకాంత్‌ వేసిన సెటైర్‌కి కమల్‌ కాస్త తీరిగ్గా స్పందించాడు.

‘గెలుపు అంటే, అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. ప్రజల మనసుల్ని గెల్చుకోవడం. రాజకీయాల్లోకి నేను రావడం ద్వారా ప్రజలకు కాస్తయినా మేలు జరిగితే, అది ఏ రూపంలో జరిగినా నేను గెలిచినట్లే.. దానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు..’ అని అన్నాడు కమల్‌హాసన్‌. ‘మా ఇద్దరి మధ్యా స్నేహం ఎవరికీ అర్థం కాదు. మేం మంచి స్నేహితులం. నేనేం మాట్లాడుతున్నానో రజనీకాంత్‌కి అర్థమవుతుంది.. అతనేం మాట్లాడుతున్నాడో నాకు అర్థమవుతుంది.. అది మా ఇద్దరికే తెలుసు.. మీకు మేం శతృవుల్లా కన్పిస్తే అది మా తప్పు కానే కాదు..’ అంటూ కమల్‌ క్లారిటీ ఇచ్చాడు.

నిజమే, కమల్‌ – రజనీ ఎవరికీ అర్థం కారు.. అందుకే ఈ ఇద్దరూ ‘విచిత్ర స్నేహితులు’.