కరోనా తరువాత ఇండియా కోలుకోవాలంటే..

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా భయపెడుతున్నదో చెప్పక్కర్లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడి వ్యక్తులు అక్కడే ఆగిపోవడంతో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆర్ధికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలే కాదు, దేశం మొత్తం కూడా ఆర్ధికంగా కుంగిపోయింది. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. వేలకోట్ల రూపాయల నష్టం సంభవించింది.

అసలే ఆర్ధిక మాంద్యం. దీనికి తోడు కరోనా ప్రభావం. కరోనా వైరస్ నుంచి ఇండియా బయటపడటానికి కనీసం రెండు మూడు నెలలు పట్టేలా కనిపిస్తోంది. ఎండాకాలం పూర్తయ్యే సరికి ఈ వైరస్ నుంచి బయటపడాలి. లేదంటే వచ్చేది వర్షాకాలం. ఆ సమయంలో కరోనాను కట్టడి చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఏప్రిల్, మే నెల వరకు కరోనాను కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఇండియా పనిచేస్తున్నది.

ఒకవేళ ఇండియా కరోనా నుంచి మరో నెల లేదంటే రెండు నెలల తరువాత బయటపడితే… ఇప్పటి వరకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ధరలు పెరగకుండా ఉండేందుకు ఆర్బీఐ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. 90 మంది ఉగ్యోగులు నిరంతరం దీనిపై పనిచేస్తున్నారు. వీలైనంతగా ఎకానమీని అదుపులో ఉంచేందుకు ఈ ఉద్యోగులు సహకరిస్తుంటారు. ప్రపంచంలో ఇలా ఒక వార్ రూమ్ ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.