దిల్ రాజు ఎప్పుడంటే అప్పుడేనా?

స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కించిన పీరియాడికల్ మూవీ ‘రుద్రమదేవి’. అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ఈ మూవీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించింది. అయితే గుణశేఖర్ ఆశించిన స్థాయి సక్సెస్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దీంతో కొంత విరామం తీసుకున్న దర్శకుడు గుణశేఖర్ కాళిదాసు విరచిత నవల శాకుంతం ఆధారంగా మహాభరత ఇతిహాసంలోని ఆదిపర్వంలోగల శాకుంతలం దుశ్యంతుడి ప్రేమ గాథని తీసుకుని మైథలాజికల్ డ్రామాగా ‘శాకుంతలం’ని మొదలు పెట్టారు.

సమంత టైటిల్ పాత్ర పోషించగా దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా ప్రకాష్ రాజ్ కన్వరిషిగా కీలక పాత్రల్లో నటించిన ఈ మైథలాజికల్ డ్రామాని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించింది. షూటింగ్ పూర్తయింది. గత కొంత కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న సమంత పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

ఇక సెప్టెంబర్ 18న దుశ్యంతుడిగా నటిస్తున్న దేవ్ మోహన్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. అంతకు మించి ఇంత వరకు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ని మేకర్స్ రిలీజ్ చేయలేదు.

గత కొన్ని నెలలుగా ఈ మూవీకి సంబంధించిన సీజీ వర్క్ జరుగుతోంది. జనవరిలో రిలీజ్ అన్నారు కానీ రాలేదు. అయితే పర్ ఫెక్ట్ టైమ్ ని చూసి రిలీజ్ చేయాలని ముందు నుంచి అనుకుంటున్నారు. నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి బ్యాక్ సపోర్టర్ గా దిల్ రాజు వున్నారు.

ఆయనే ఈ మూవీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే హక్కుల్ని ముందే సొంతం చేసుకున్నారు. దీంతో ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఆయన చేతుల్లో వున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎప్పుడంటే అప్పుడే రిలీజ్ అని గుణశేకర్ అంటున్నారట. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తో పాటు రిలీజ్ వ్యవహరాలు ఆయనే చూసుకోవాలి కాబట్టి ఆ భారాన్ని దిల్ రాజుకే వదిలేశారట. ఆ కారణంగానే ఆయన ఎప్పుడు సై అంటే అప్పుడు రిలీజ్ చేయాలనే ఆలోచనలో గుణశేఖర్ వున్నట్టుగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇంత వరకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాని ఈ మూవీని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జనవరిలో రిలీజ్ అనుకుంటే భారీ సినిమాల పోటీ వుంది. అంతే కాకుండా ఆ టైమ్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ కూడా రిలీజ్ కాబోతోంది. కాబట్టి దిల్ రాజు ‘శాకుంతలం’ని డిసెంబర్ కే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. డిసెంబర్ లో పెద్ద సినిమాల పోటీ వుండే అవకాశం లేకపోవడంతో గుణశేఖర్ కూడా దిల్ రాజు నిర్ణయానికే సై అంటున్నాడట. త్వరలోనే రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం వుందని తెలిసింది.