నంద్యాల తీర్పు ప్రత్యేకహోదాకు వ్యతిరేకమా?

0
11

కేంద్రం నుంచి ప్రత్యేకహోదా తీసుకురావడం చేతకాకపోయినప్పుడు- పాలక పార్టీలు మౌనంగా ఉండిపోతే వారికే మంచిది. లేదా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నట్లుగా ప్రత్యేక హోదా అనేది ఉపయోగం లేదు.. దానిని మించిన ప్యాకేజీ వస్తుంది.. హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటూ సామాన్యులకు అర్థంకాని పడికట్టు పదాలతో మాయ చేయడం మరో పద్ధతి.

అయితే ఇప్పుడు ప్రత్యేకహోదా అనే అంశం మళ్లీ తెరమీదకు వచ్చి ప్రజల ఆలోచనల్లో నలుగుతున్న సమయంలో.. దాన్ని అణిచివేయడానికి పచ్చకాషాయదళాల తరఫున కొత్త గోబెల్స్ లు తయారవుతున్నారు. అందరూ కలిసి నంద్యాల ఎన్నికల్లో తీర్పు తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చిందంటే దాని అర్థం.. రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదాని అక్కర్లేదని కోరుకుంటున్నట్లే అని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నానికి తెగబడుతున్నారు.

తమ తమ పార్టీల గురించి అబద్ధాలను ప్రచారం చేసుకుని, తమ ఇమేజి పెంచుకోడానికి వారు ఎంతగా గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయించినా ఆ తీరు వేరేగా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేసేలాగా.. నంద్యాల తీర్పును ప్రత్యేక హోదాకు వ్యతిరేకమైన ప్రజాతీర్పుగా అభివర్ణించడానికి తెలుగుదేశం, భాజపా నాయకులకు ఎలా మొహం చెల్లుతోందో కదా అని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక అనేది ఆ జిల్లాలోనే పట్టున్న ప్రజల్లో అభిమానం ఉన్న సీనియర్ నాయకుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో వచ్చిన ఎన్నిక. అలాంటి ఎన్నికలో సహజంగా సానుభూతి మాత్రమే పనిచేస్తుంది. ఇలాంటి ఎన్నికల్లో చాలా సందర్భాల్లో పోటీచేసిన ఏ ఒక్కరికీ కూడా డిపాజిట్ దక్కనంతగా ఫలితాలు వస్తుంటాయి. అయితే వైసీపీ చాలా గట్టిగా తమ ప్రయత్నాలు చేయడంతో.. తెలుగుదేశం మెజారిటీ 30వేల వరకు వచ్చింది. ఎవ్వరైనా సరే ఈ విజయాన్ని భూమా మరణం నేపథ్యంలో దక్కిన సానుభూతి ఓట్లతో మాత్రమే వచ్చిందని అంటారు.

చంద్రబాబునాయుడు కూడా ఎన్నికల ప్రచారంలో పదేపదే తల్లీతండ్రిని కోల్పోయిన పిల్లలు అని పదేపదే అంటూ జనంలో సానుభూతిని ఓట్లుగా పిండుకోవడానికి నానా పాట్లు పడ్డారు. తీరా విజయం దక్కిన తర్వాత.. నిస్సిగ్గుగా.. తమ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనడానికి నిదర్శనమే ఈ విజయం అంటూ చెప్పుకున్నారనే అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. నిన్నటిదాకా చంద్రబాబు కు నీరాజనం పట్టిన ఫలితం అంటూ ప్రచారం చేసిన పచ్చ-కాషాయ గోబెల్స్ అందరూ ఇవాళ కొత్త పాట అందుకున్నారు.

ప్రత్యేక హోదా అంశం మళ్లీ ప్రజల్లోకి రాగానే.. నంద్యాల తీర్పు హోదాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే కదా.. అని తమను జనం ఛీకొడతారనే వెరపు కూడా లేకుండా మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నంద్యాల ఎన్నికలో కనీసం ప్రచారానికి కూడా వెళ్లని భాజపా నాయకులు కూడా అక్కడి గెలుపును హోదాకు వ్యతిరేకం అనడం లేకిగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. తెలుగుదేశం పార్టీనే ప్రత్యేకహోదా కు వ్యతిరేకం అని, వారిని సమర్థించే వాళ్లంతా హోదాకు వ్యతిరేకం అని ఆ పార్టీ నాయకులే చాటుకొంటున్నట్లుగా కనిపిస్తోంది.