నాని బిజీ బిజీ… లైన్‌లో అరడజను!

నాని బ్యాక్ టు బ్యాక్‌ దసరా, హాయ్‌ నాన్న సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని, తాజాగా సరిపోదా శనివారం సినిమాతో వచ్చాడు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు. కానీ రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు పెరిగినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొదటి వారం రోజుల్లో సరిపోదా శనివారం దాదాపుగా రూ.80 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. నాని బాక్సాఫీస్ వద్ద కంటిన్యూస్ గా సందడి చేస్తూనే ఉన్నాడు.

వరుస హిట్స్ తో హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, త్వరలో చేయబోతున్న సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేస్తున్నారు. కానీ నాని మాత్రం సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రాబోయే రెండేళ్లలో నాని నుంచి అరడజనుకు పైగా సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిపోదా శనివారం సినిమా విడుదల అయిన వెంటనే ‘హిట్‌ 3’ మూవీని ప్రకటించిన విషయం తెల్సిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందబోతున్న హిట్‌ 3 వచ్చే వేసవిలోనే విడుదల అవ్వబోతుంది.

దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవ్వలేదు. దాంతో హిట్‌ 3 ని మొదట పట్టాలెక్కించే ఆలోచనలో నాని ఉన్నాడు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేయడం జరిగింది. హిట్‌ 3 తర్వాత దసర దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి లో శ్రీకాంత్‌ ఓదెల మూవీ ప్రారంభం అయ్యి, అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా నాని ఇప్పటికే సుజీత్‌ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్‌ అయ్యాడు. పవన్ తో ఓజీ చేస్తున్న సుజీత్‌ తన తదుపరి సినిమాగా నానితో సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో కూడా నాని సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే గౌమ్ తిన్ననూరి చేస్తున్న సినిమా తర్వాత నాని సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను నాని చేయనున్నాడు. ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ మరో వైపు నిర్మాతగా కూడా నాని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు.