ప్రతి ఒక్కరికీ ఆ టైమ్ వచ్చింది: పూరి

ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని దేశానికి సేవ చేసే టైమ్ వ‌చ్చింది. ద‌య‌చేసి ఆ ప‌ని చేయండి. ఇంట్లో కూర్చోండి, దేశాన్ని కాపాడండి.. అని పిలుపునిచ్చారు డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌. ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు అంద‌రూ స‌హ‌క‌రించి క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా వైర‌స్‌ ఊహాతీతంగా విజృంభిస్తోంద‌నీ, దాన్ని అదుపు చేయ‌క‌పోతే మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరుగుతుంద‌నీ ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌నిచ్చిన వీడియో సందేశాన్ని మంగ‌ళ‌వారం న‌టి, నిర్మాత చార్మీ కౌర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీనికి ఆమె ‘లాక్‌డౌన్ త‌ప్ప‌నిస‌రి’ అనే ట్యాగ్‌ను జోడించారు.

చార్మీ షేర్ చేసిన వీడియోలో పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ.. ‘‘గ్లోబ‌ల్ వార్మింగ్‌, క్లైమేట్ చేంజ్‌, గ్రీన్ గ్యాసెస్.. ఇలాంటి మాట‌లు విన్న‌ప్పుడు 90 శాతం మ‌నం జోకులు వేస్తుంటాం. ప‌క్క‌నోడు ఎవ‌డైనా ఇలాంటి టాపిక్ ఎత్తినా ‘అబ్బా ఛా.. నీకెందుకురా?’ అని ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటాం. ఆస్ట్రేలియాలో రెండు నెల‌లు అడ‌వి త‌గ‌ల‌బ‌డుతున్నా మ‌నం ప‌ట్టించుకోం. 30 శాతం ఆక్సిజ‌న్ ఇచ్చే అమెజాన్ ఫారెస్ట్ త‌గ‌ల‌బ‌డుతున్నా ప‌ట్టించుకోం. ఆర్కిటిక్ ఐస్ క‌రిగిందంటే మ‌నం జోకులేస్తాం. కానీ క‌రోనా వ‌చ్చి ఇప్పుడు అంద‌రి చెంప‌లూ లాగి కొట్ట‌బోతోంది. ఇప్పుడు మ‌న‌కు అన్నీ అర్థ‌మ‌వుతాయ్‌. వియ్ ఆర్ ఆల్ క‌నెక్టెడ్ అనే విష‌యం తెలుస్తుంది.