ప్రపంచ మానవాళికి సరికొత్త డేంజర్.. గబ్బిలాల నుంచి మరో వైరస్

కరోనాకు ముందు వైరస్ అన్నా.. కొత్త జబ్బులు వ్యాపిస్తున్నాయన్నా పెద్దగా బెదిరే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చి.. యావత్ ప్రపంచాన్నిఒక ఊపు ఊపేసిందో అప్పటి నుంచి వైరస్ తీవ్రత సామాన్యుడికి సైతం అర్థమైంది. వైరస్ ప్రపంచ గమనాన్ని ఎంతలా మారుస్తుందన్న భయాందోళనల్ని తీసుకొచ్చింది.

ఇలాంటివేళ.. గతంతో పోలిస్తే..కొత్త వైరస్ లకు సంబంధించిన అంశాల్ని తెలుసుకోవటం కోసం ఆసక్తి పెరగటమే కాదు.. అలాంటి సమాచారం తెలుసుకొని మరింత అప్రమత్తంగా ఉండాలనుకునే వారి సంఖ్య పెరిగింది.

తాజాగా సరికొత్త వైరస్ సమాచారం ఒకటి హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ సైంటిస్టులు వెల్లడించిన సమాచారం ప్రకారం గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందిన స్వభావం ఉన్న ఖోస్టా2 వైరస్ మీద కీలక ప్రకటన చేశారు. 2020లో ఈ వైరస్ ను రష్యా గబ్బిలాల్లో గుర్తించినట్లుగా వారు పేర్కొన్నారు. ఆ సమయంలో అది మనుషులకు అంత ప్రమాదం కలిగిస్తుందని తాము అనుకోలేదన్న సైంటిస్టులు.. సుదీర్ఘ పరిశోధనల అనంతరం దీని ప్రభావం అర్థమైనట్లు పేర్కొన్నారు.

మనిషి కణజాలంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ వైరస్.. ఒకసారి మనుషులకు వ్యాప్తిస్తే.. తీవ్రంగా వ్యాప్తి చెందటంతో పాటు.. దీని ద్వారా వచ్చే ముప్పు ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ గా పేర్కొంటున్నారు.

మనిషి కణాలకు ఇన్ ఫెక్షన్ సోకించటంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్ లకు ఈ వైరస్ నిరోధకతను కలిగి ఉంటుందన్నారు. ఖోస్టా 2 కూడా కరోనాకు చెందిన మూల కుటుంబం సార్స్ కోవ్ 2కు చెందినదే.ఒకే ఫ్యామిలీకి చెందిన ఈ కొత్త వైరస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇందులో కూడా ఖోస్టా 1.. ఖోస్టా 2 అని రెండు ఉన్నాయని.. ఖోస్టా 1న మనుషులకు సోకదని చెబుతున్నారు.

ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్న వారు.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు దీని బారి నుంచి తప్పించుకోలేరని చెబుతున్నారు. గబ్బిలాలు.. పాంగోలిన్స్.. రకూన్ డాగ్స్.. పామ్ సివెట్స్ జీవుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే వీలుందని చెబుతున్నారు. ఈ వైరస్ తీరు.. వ్యాక్సినేషన్ తయారీపై ఒక అంచనాకు ఇప్పుడే రాలేమంటున్నారు. ఏమైనా.. గతంలో మాదిరి కాకుండా.. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మళ్లీ అసన్నమైనట్లేనా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.