కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రాయన్. ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో రాయన్ సినిమాని నిర్మించింది. జులై 26న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజే సాలీడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయినా కూడా బీ, సీ సెంటర్స్ లో రాయన్ మూవీ మంచి కలెక్షన్స్ ని అందుకోగలిగింది.
ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ మూడు రోజులు కూడా మంచి వసూళ్లు వచ్చాయి. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో ధనుష్ తమ్ముడిగా కీలక పాత్రలో నటించాడు. మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ధనుష్ ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ధనుష్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉండడంతో జనాల్లోకి మౌత్ టాక్ బలంగా వెళ్ళింది.
దీంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ధనుష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ దిశగా ఈ మూవీ దూసుకుపోతోంది. 100 కోట్ల క్లబ్ లో రాయన్ చిత్రం మరో రెండు మూడు రోజుల్లో చేరడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా సినిమాకి అదనపు అస్సెట్ అయ్యిందనే టాక్ కోలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది.
ఇదిలా ఉంటే కెప్టెన్ మిల్లర్ సినిమాతో కమర్షియల్ ఫ్లాప్ అందుకున్న ధనుష్ కి రాయన్ మంచి సూపర్ హిట్ అందించబోతుందని సినీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు అయితే రిలీజ్ కావడం లేదు. దీంతో రాయన్ లాంగ్ రన్ లో మంచి వసూళ్లని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రాయన్ సినిమాలో ధనుష్ చెప్పిన కథ పాతదే ఆయన దానిని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా నెరేట్ చేయగలిగారు.
ఈ సినిమాలో ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటించారు. రాయన్ మూవీకి తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. సార్ మూవీ తర్వాత ధనుష్ ఖాతాలో రాయన్ మరో సక్సెస్ ఫుల్ చిత్రంగా మారబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ధనుష్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో కుభేర ప్రేక్షకుల ముందుకి రానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.. 2025 ఏడాది ఆరంభంలో కుభేర మూవీ థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.