మంచు విష్ణు.. ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ

కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు మంచు హీరోలు. ఇటు విష్ణు, అటు మనోజ్ ఇద్దరూ కూడా కెరీర్లో ఎన్నడూ లేని విధంగా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. గత రెండేళ్లలో. వరుసగా దారుణ పరాజయాలు ఎదురవడంతో వారికి బ్రేక్ తప్పలేదు. ఇప్పుడు మళ్లీ కుదురుకుని జాగ్రత్తగా కొత్త సినిమాలు చేసుకుంటున్నారు.

మనోజ్‌తో పోలిస్తే విష్ణు కొత్త ఇన్నింగ్స్‌లో ఎక్కువ చురుగ్గా కనిపిస్తున్నాడు. ‘మోసగాళ్ళు’ అనే కొత్త సినిమాను దాదాపుగా పూర్తి చేసిన విష్ణు.. తన కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’ను తెరపైకి తెచ్చే ప్రయత్నంలోనూ ఉన్నాడు. వేరే కొత్త సినిమాలకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇలాంటి సమయంలో విష్ణు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన కెరీర్లో ఒడుదొడుకులు, వివాదాలు, ఇతర అంశాలపై ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు విష్ణు. ఈ సందర్భంగా తన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘ఆచారి అమెరికా యాత్ర’ గురించి సెన్సేషనల్ కామెంట్లు చేశాడు విష్ణు. తనకు ముందు దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ వేరని.. కానీ షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లాక కథ మారిపోయిందని.. ఈ విషయమై నాగేశ్వరరెడ్డిని నిలదీశానని విష్ణు చెప్పడం ఈ ఇంటర్వ్యూలో ప్రోమోలో కనిపించింది.

అలాగే ఓ సినిమా రషెస్ చూసినపుడు అది ఆడదని అర్థమైందంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. మరి ఆ వ్యాఖ్య ‘ఆచారి అమెరికా యాత్ర’ గురించి మరోదాని గురించా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే ‘గాయత్రి’ సినిమాకు సంబంధించి మోహన్ బాబుకు, తమన్‌కు విభేదాలు రావడంపైనా ఈ ఇంటర్వ్యూలో విష్ణు స్పందించాడు. త్వరలో పూర్తిగా అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్వ్యూలో విష్ణు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు.