మరోసారి ఆత్మను వెనకేసుకొచ్చిన సుకుమార్

దేవిశ్రీప్రసాద్ ను తన సోల్ మేట్ (ఆత్మ)గా చెబుతుంటాడు దర్శకుడు సుకుమార్. అలాంటి వ్యక్తిపై ఈగ కూడా వాలనివ్వడు. శివనాగులు విషయంలో దేవిశ్రీపై అందరూ విమర్శలు చేస్తే, సుకుమార్ మాత్రం అతడ్ని వెనకేసుకొచ్చాడు. సద్దుమణిగిందనుకున్న ఈ విషయంపై మరోసారి రియాక్ట్ అయ్యాడు. అయితే గతంలో సుకుమార్ ఇచ్చిన వివరణకు, తాజాగా అతడు చేసిన ప్రకటనకు సంబంధం లేకపోవడం బాధాకరం.రంగస్థలం రిలీజైన 2రోజులకే ఈ వ్యవహారం బయటకొచ్చింది. శివనాగులు పాడిన పాట స్థానంలో అతడి వాయిస్ ను తీసేసి, దేవిశ్రీప్రసాద్ గొంతునే కొనసాగించారు. విజువల్ తో సింక్ అవ్వకపోవడం వల్లనే శివనాగులు వాయిస్ తీసేయాల్సి వచ్చిందని గతంలో ప్రకటించాడు సుకుమార్. ఇప్పుడు మాత్రం దానికి విరుద్ధమైన ప్రకటన చేశాడు.

ఆ గట్టునుంటావా అనే పాటను దేవిశ్రీప్రసాద్ వాయిస్ తోనే షూట్ చేసినప్పటికీ.. ఎడిటింగ్ టైమ్ కు శివనాగులు వాయిస్ అందుబాటులోకి వచ్చిందని, కానీ శివనాగులు కంటే దేవిశ్రీ ప్రసాద్ గొంతే బాగుందని చెప్పుకొచ్చాడు. పోస్ట్ ప్రొడక్షన్ హడావుడిలో ఉండడం వల్ల శివనాగులుకు ఫోన్ చేయలేకపోయానన్న సుకుమార్.. మూవీ రిలీజ్ తర్వాత అతడ్ని కలిశారా అనే ప్రశ్నకు కలవలేదని సమాధానం ఇచ్చాడు. అంటే, మూవీ రిలీజ్ తర్వాత కూడా శివనాగుల్ని కలిసేంత తీరిక సుకుమార్ కు లేదని అనుకోవాలా.

ఈ విషయాన్ని పక్కనపెడితే, తన సినిమాకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఏం చేసినా దాన్ని సమర్థిస్తానని అంటున్నాడు సుకుమార్. అల్టిమేట్ గా సినిమా పెద్దదని, అలాంటి సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ఎంత కష్టాన్నయినా భరిస్తాడని మెచ్చుకున్నాడు. ఆల్బమ్ లో మంచి పాట ఉంటే అది దేవిశ్రీనే పాడేస్తాడని, సింగర్స్ కు ఛాన్స్ ఇవ్వడనే విమర్శకు పై విధంగా స్పందించాడు సుకుమార్.