వారందరూ గెలిస్తేనే… ప్రజామోదం ఉన్నట్టు

శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ పగ్గాలు చేపట్టారు. కానీ.. ఈసారి దొడ్డిదారిలో ఆయన అధికార పీఠం మీదికి వచ్చేశారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన తీర్పుతో ఆయనను తిరస్కరించిన ప్రజలు.. ఈ వక్రమార్గాన్ని ఆమోదిస్తున్నారా? లేదా? ఎప్పటికి తేలుతుంది… త్వరలోనే ఆ సంగతి తేలాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా.. భాజపా సర్కారు ఏర్పడడానికి బహుధా మార్గాలు సుగమం చేసిన.. 22 మంది ఎమ్మెల్యేలు మళ్లీ భాజపా టిక్కెట్ మీద గెలిచినప్పుడు మాత్రమే.. ఈ ప్రభుత్వానికి ప్రజామోదం ఉన్నట్లు అనుకోవాలి.

భారతీయ జనతా పార్టీ వక్ర రాజకీయాల్లో అందెవేసిన చేయి అయిపోతోంది. కర్ణాటకలో ఏర్పడిన భాజపాయేతర ప్రభుత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కూల్చివేయడానికి గోతికాడ నక్కలా పొంచి ఉన్న భాజపా.. చివరికి ఆ విషయంలో విజయం సాధించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి గద్దె ఎక్కింది. తిరిగి వారందరూ కాషాయకండువాతో ఎన్నికల్లో దిగి.. మళ్లీ నెగ్గారు. ఇప్పుడు మద్యప్రదేశ్ లో కూడా అదే ఫార్ములాను మళ్లీ ప్రయోగించింది.

అంతో ఇంతో గుడ్డిలో మెల్ల లాంటి సానుకూల అంశం ఏంటంటే.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఏకపక్షంగా ప్రజలు అనుకూల తీర్పు ఇవ్వలేదు. వారూ అతుకుల బొంతలాంటి సర్కారునే ఏర్పాటుచేశారు. అయితే గెలిచిన తర్వాత.. సొంత పార్టీలో మారిన ప్రాధమ్యాలు, లుకలుకలు ఆ పార్టీ పుట్టి ముంచాయి. జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తి భగ్గున మండడంతో పార్టీ దగ్ధం అయిపోయింది. కాస్త మార్పు చేర్పులతో తప్పు దిద్దుకోవడానికి కూడా సాధ్యం కానంతగా.. ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసేశారు. గతిలేని స్థితిలో కమల్ నాధ్ సీఎంగా రాజీనామా చేశారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి మళ్లీ గద్దె ఎక్కారు. 22 మంది ఫిరాయింపుదార్ల సీట్లు ఖాళీ అయిన నేపథ్యంలో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో నూటికి నూరుశాతం భాజపా తరఫున బరిలోకి దిగే వారందరినీ గెలిపించుకోవడం.. పార్టీకి అత్యావశ్యకం. నిజానికి ప్రభుత్వం నిలబడడానికి సగం మంది గెలిచినా చాలు. కానీ.. మొత్తం అన్ని సీట్లు గెలుచుకున్నప్పుడు మాత్రమే.. వారి ప్రయత్నం ప్రజల దృష్టిలో కుట్రగా చెడ్డపేరు తెచ్చుకోలేదని, ప్రజలు వారి ఎత్తుగడలను ఒప్పుకున్నారని అర్థమవుతుంది. ఆ దిశగా కమలదళాలు ఏం చేస్తాయోచూడాలి.