వైఎస్సార్సీపీకీ టీడీపీకి తేడా ఏంటి.?

0
12

వైఎస్సార్సీపీకి తెలంగాణలో పెద్దగా క్యాడర్‌ లేదు. ఆ మాటకొస్తే, తెలంగాణపై 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పెద్దగా ఫోకస్‌ పెట్టింది లేదు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యింది. 2014 ఎన్నికల ఫలితాల విషయానికొస్తే, ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఏం లాభం.? అతి తక్కువ కాలంలోనే వాళ్ళంతా టీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. దాంతో, మొత్తంగా తెలంగాణలో వైఎస్సార్సీపీ జెండా మాయమైపోయింది.

ఇక, టీడీపీ విషయానికొస్తే తెలంగాణలో బలమైన క్యాడర్‌ ఆ పార్టీ సొంతం. కానీ, ఏం లాభం.? చంద్రబాబు రెండు నాల్కల వైఖరి కారణంగా తెలంగాణలో టీడీపీ ఇప్పుడు గల్లంతయ్యే పరిస్థితికి చేరుకుంది. ఒకరా.? ఇద్దరా.? తెలంగాణలో టీడీపీ చాలామంది ముఖ్య నేతల్ని ఇతర పార్టీలకు ‘అప్పగించింది’. నిజమే మరి.! కేసీఆర్‌, ఒకప్పుడు టీడీపీలో ఎదిగిన నాయకుడే. నాగం జనార్ధన్‌రెడ్డి కావొచ్చు, ఎర్రబెల్లి దయాకర్‌రావు కావొచ్చు, కడియం శ్రీహరి కావొచ్చు.. చెప్పుకుంటూ పోతే, వంద మందికి పైగా కన్పిస్తారు ఇలాంటి నేతలు. ఇంత బలగం వుండీ, టీడీపీ తెలంగాణలో అవసాన దశకు వచ్చేసింది.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓ ఎంపీ, 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అయినా, ఆ పార్టీకి ఇప్పుడు ఎంతమంది ప్రజా ప్రతినిథులు మిగిలారు.? అని లెక్కలేస్తే ఎవరూ కనిపించని పరిస్థితి. అంటే, క్యాడర్ లేని వైఎస్సార్సీపీతో బలమైన క్యాడర్ వున్న టీడీపీ ఈ విషయంలో పోటీ పడుతోందనుకోవాలేమో.

కారణాలేవైతేనేం, తెలంగాణలో మొన్న వైఎస్సార్సీపీ ఖతం అయిపోయింది, ఇప్పుడు టీడీపీ ఖతం అయిపోతోంది. తెలంగాణలో ఇకపై ఎంత గింజుకున్నా ఈ రెండు పార్టీలకూ చాన్స్‌ లేనట్టే. కేసీఆర్‌ పదే పదే చెప్పిన మాటే నిజమయ్యింది. ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో చోటు లేదని. తెలంగాణ మీద ఆశలు పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్‌ని నట్టేట్లో ముంచేసిన సోకాల్డ్‌ ‘పార్టీల అధినేతలకి’ ఇదొక గుణపాఠం.!