సుక్కుకి సమంత చెంపపెట్టులాంటి సమాధానం

‘రంగస్థలం’ సినిమాలో పెర్పామెన్స్ పరంగా రామ్ చరణ్ తర్వాత అంతటి పేరు సమంతకే వచ్చింది. ఎప్పుడూ మోడర్న్ క్యారెక్టర్లలో కనిపించే సమంత.. పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మి పాత్రలో చాలా బాగా నటించింది. ఆమె గెటప్.. నటన అన్నీ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఇంత బాగా తన పాత్రను పండించిన సమంతను ముందు ఆ పాత్రకు వద్దే వద్దని అనుకున్నట్లుగా సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాకు సమంత పేరును ఎవరు సజెస్ట్ చేశారని చెప్పలేదు కానీ.. ఆమెను తాను రిజెక్ట్ చేసినట్లుగా మాత్రం సుకుమార్ వెల్లడించాడు. సమంత ఈ పాత్రకు సెట్టవుతుందా అన్న సందేహానికి తోడు.. ఇద్దరు స్టార్లను తాను సెట్లో డీల్ చేయనేమో అన్న అనుమానంతో సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ చెప్పాడు.

తాను సెట్లోనే డైలుగులు రాయిస్తుంటానని.. అందరినీ వెయిట్ చేయిస్తుంటానని.. చరణ్ ఏంటో తెలుసు కాబట్టి అతడిని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చని అనుకున్నానని.. ఐతే సమంతను కూడా తీసుకుంటే ప్రతి రోజూ అలాంటి స్టార్ హీరోయిన్ని ఇబ్బంది పెట్టడం.. సారీ చెప్పడం అంతా ఎందుకులే.. ఒక కొత్త అమ్మాయిని తీసుకుందామని అనుకున్నానని సుకుమార్ తెలిపాడు. కానీ చరణ్ లాగే సమంత కూడా తనకు చాలా సహకరించిందని.. ఒక జూనియర్ ఆర్టిస్టును మనం ఎలా డీల్ చేస్తామో ఆమెను కూడా అలా మేనేజ్ చేయొదచ్చని తర్వాత అర్థమైందని సుకుమార్ తెలిపాడు. ఇక నటన విషయానికి వస్తే ఆమె ఒక్కొక్క సీన్లో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లకు తాను ఫిదా అయిపోయానని.. ఆమె అలా నటించినపుడల్లా ఫట్ ఫట్ మని తనను కొట్టినట్లుగా అనిపించిందని.. ఈమెనా తాను వద్దు అనుకున్నానన్న ఫీలింగ్ కలిగిందని.. సమంత నటన తనకు చెంపపెట్టు లాంటి సమాధానం అని సుకుమార్ చెప్పాడు. సమంతకు అంతలా ఇంప్రెస్ అయ్యాను కాబట్టే ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆమెతో జీవితాంతం సినిమాలు చేస్తూనే ఉండాలనిపిస్తోందని వ్యాఖ్యానించానని సుకుమార్ వెల్లడించాడు.