అజ్ఞాతం వీడాడు.. స్పష్టత ఎప్పుడు?

ఓ సినిమా ఫ్లాప్ అయితే చాన్నాళ్లు కనిపించడు పవన్. కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి, మళ్లీ జనాల్లో కలవడానికి చాలా నెలలు టైం తీసుకుంటాడు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ ఇలానే అదృశ్యమైపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ హీరో మాత్రం ఈసారి తొందరగానే అజ్ఞాతం నుంచి బయటకొచ్చాడు.

అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత తొలిసారి తన భార్యతో కలిసి ఓ చర్చిలో ప్రార్థనకు హాజరయ్యాడు పవన్. తన పర్యటనకు ముందు సర్వమత ప్రార్థనలు చేస్తానని ప్రకటించిన పవన్, చెప్పినట్టుగానే ఈరోజు నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తాడు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తానని తెలిపారు.

పవన్ ఇలా ప్రకటించగానే, అప్పుడే రాజకీయంగా అతడిపై విమర్శలు ప్రారంభమయ్యాయి. పవన్ కొండగట్టు రాకను అడ్డుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ మాట్లాడిన మాటల్ని ఉపసంహరించుకుంటేనే కొండగట్టులోకి అడుగుపెట్టనిస్తామని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ రాజకీయం ఎలా ఉందో ఇప్పటికే అందరూ చూశారు. టీడీపీపై ఎలాంటి మచ్చపడకుండా, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్నాడు పవన్. మరి తెలంగాణలో పవన్ రాజకీయ ప్రణాళిక ఎలా ఉండబోతోంది. తెలంగాణలో పవన్ కు రాజకీయ మిత్రులు లేరు. పవన్ ఓ ప్రకటన చేస్తే దాన్ని సమర్షించే రాజకీయ గణం లేదు. కేసీఆర్, కేటీఆర్ తో పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కొండగట్టు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మొత్తమ్మీద అటు అజ్ఞాతవాసి డిజాస్టర్ ను మరిపించడంలో, ఇటు రాజకీయంగా జనాల్ని మరోసారి ఆకర్షించడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే సినిమాలా, రాజకీయాలా అనే విషయంపై ఈ పర్యటనలోనైనా అందరికీ అర్థమయ్యేలా క్లారిటీ ఇస్తే బాగుంటుంది.