అజ్ఞాతవాసి ఎఫెక్ట్: పవన్ కు దారేది?

అజ్ఞాతవాసి సూపర్ హిట్ అయితే దాదాపు సినిమాలు మానేయాలని అనుకున్నాడు. పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని భావించాడు. అలా కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి, కావాలంటే అప్పుడు మరో సినిమా చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యాడు పవన్. కానీ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. పవన్ ప్లాన్స్ కు బ్రేక్ వేసింది.అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో పవన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నానేది ఆసక్తికరంగా మారింది. నష్టపోయిన బయ్యర్ల కోసం అతడు మరో మూవీ స్టార్ట్ చేస్తాడా.. లేక జనసేన వైపు మొగ్గుచూపుతాడా అనేది ప్రశ్న.

నిజానికి ఎన్నికల లోపు పవన్ మరో సినిమా చేస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. నెక్ట్స్ సినిమాకు కాల్షీట్లు కేటాయించేంత టైమ్ పవన్ వద్ద ఉంది. మొన్నటికి మొన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. మరి ఈ బ్యానర్ లో పవన్ సినిమా చేస్తాడా లేక ఇంతకుముందు కమిటైన ఏఎం రత్నంకే సినిమా చేస్తాడా..?

మరోవైపు పవన్ ఇక సినిమాలకు గ్యాప్ ఇస్తాడనే వాళ్లు కూడా ఉన్నారు. అజ్ఞాతవాసితో పాతిక సినిమాలు పూర్తిచేసిన పవన్, రాజకీయాలపై పూర్తిగా దృష్టిపెట్టిన తర్వాత 2020నుంచి మళ్లీ సినిమాలు చేస్తాడనే వాదన కూడా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో నేరుగా కొన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని పవన్ ప్రకటించాడు.అలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలంటే ఇప్పట్నుంచే జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. కాస్త ముందుగానే ఎన్నికలు రావొచ్చంటూ సంకేతాలు వినిపిస్తున్నాయి కాబట్టి, ఇలాంటి టైమ్ లో ఇంకో సినిమా స్టార్ట్ చేస్తే పొలిటికల్ గా పవన్ కు నష్టం కలగొచ్చు.

అయితే పవన్ ఏం చేయబోతున్నాడనే విషయంపై ప్రస్తుతానికి అతడికే క్లారిటీ రాలేదు. సినిమాలు ఆపేస్తానని ఒకసారి, కొనసాగిస్తానని మరోసారి గతంలో గజిబిజి ప్రకటనలు చేసిన పవన్.. రాజకీయాలకు తన దగ్గర డబ్బు లేదు కాబట్టి మరో సినిమా చేస్తానంటూ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.