అతడితో చైతూ.. సెట్టవుతుందా?

కొందరు హీరోల్ని చూస్తే మాస్‌గా కనిపిస్తారు. వాళ్లకు క్లాస్ సినిమాలు అంతగా సెట్టవ్వవు. ఇంకొందరు హీరోల్నిచూస్తే క్లాస్‌గా కనిపిస్తారు. వాళ్లకు మాస్ సినిమాలు సూటవ్వవు. అక్కినేని యువ కథానాయకుడు రెండో కోవకే చెందుతాడు. కెరీర్ ఆరంభం నుంచి అతను ఎక్కువగా క్లాస్ లవ్ స్టోరీలే చేశాడు. వాటితోనే హిట్లు కొట్టాడు. అతను మాస్ సినిమాలు ట్రై చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బే తగిలింది. చివరగా గత ఏడాది ‘యుద్ధం శరణం’తో తల బొప్పి కట్టించుకున్నాడు చైతూ. ఐతే ఇప్పటికీ అతడి మాస్ మోజు తగ్గట్లేదంటున్నారు. తాజాగా అతను మరో మాస్ డైరెక్టర్‌తో జట్టు కట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఆ దర్శకుడు ఎవరో కాదు.. ‘పవర్’ సినిమాతో పరిచయమై.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. ‘జై లవకుశ’ తీసిన బాబీ. ‘సర్దార్’ దెబ్బ నుంచి కోలుకుని ‘జై లవకుశ’తో ఓ మోస్తరు విజయాన్నందుకున్న బాబీ.. దీని తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని చూశాడు కానీ సెట్టవ్వలేదు. మధ్యలో మరో హీరో పేరు కూడా వినిపించింది. ఐతే తాజా సమాచారం ప్రకారం బాబీ.. చైతూకు ఒక కథ చెప్పి ఇంప్రెస్ చేశాడట.

ప్రస్తుతం చేతిలో ఉన్న కమిట్మెంట్లు పూర్తయ్యాక సినిమా చేస్తానని చైతూ మాట ఇచ్చాడట. ఐతే పూర్తిగా మాస్ స్టయిల్లో సినిమాలు చేసే బాబీకి.. మాస్ అంటేనే తేడా కొట్టేసే చైతూకు ఏమాత్రం సెట్టవుతుందో.. వీళ్ల కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.