అది ఫస్ట్ లుక్ కాదు.. ఫొటో మాత్రమే

సినిమా టైటిల్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ లుక్ అనే పదం వాడతారు. లేకపోతే హీరోహీరోయిన్ల మొట్టమొదటి స్టిల్స్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ లుక్ అనే పదాన్ని ప్రయోగిస్తారు. కానీ టచ్ చేసి చూడు సినిమా విషయంలో మాత్రం మాటిమాటికి ఈ పదాన్ని వాడేస్తున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఓ స్టిల్ రిలీజ్ చేశారు. అంతే.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందంటూ ఒకటే హంగామా.

ఇది ఫస్ట్ లుక్ కాదు. కేవలం స్టిల్ మాత్రమే. నిజానికి టచ్ చేసి చూడు సినిమాకు సంబంధించి ఎప్పుడో ఫస్ట్ లుక్ రిలీజైంది. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదు. టైటిల్ డిజైన్ కూడా చాన్నాళ్ల కిందటే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో భాగంగా అప్పట్లో 2స్టిల్స్ విడుదల చేశారు.

ఇప్పుడు రిలీజ్ చేసింది కేవలం సినిమా ఫొటో మాత్రమే. సినిమా అప్ డేట్స్ చెప్పే క్రమంలో రిలీజ్ చేసిన ఫొటోనే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు మేకర్స్. విక్రమ్ సిరికొండ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు.సినిమా అప్ డేట్స్ ఎనౌన్స్ చేసిన యూనిట్.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మూవీ సంక్రాంతికి రాదనేది మాత్రం పక్కా.