అనుష్క స్టామినాకు అసలు పరీక్ష!

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో భాగమతి సినిమా ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ 3రోజుల్లో 12కోట్ల రూపాయల షేర్ సాధించిన భాగమతి, అటు ఓవర్సీస్ లో మరికొన్ని రోజుల్లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లనుంది. రిపబ్లిక్ డే హాలిడేకు వీకెండ్ కూడా తోడవ్వడం భాగమతికి ప్లస్ అయింది. దీనికి తోడు మార్కెట్లో మరో సినిమా పోటీలో లేకపోవడం వల్ల భాగమతికి మంచి వసూళ్లు వస్తున్నాయి.

ఇప్పటివరకు భాగమతి బండి సాఫీగానే నడిచింది. కానీ ఈరోజు నుంచి అసలు పరీక్ష షురూ కానుంది. వర్కింగ్ డేస్ ప్రారంభమైపోయాయి. సినిమా అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది. నిజంగా మూవీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మరికొన్ని రోజుల పాటు భాగమతికి ఢోకా ఉండదు. లేదంటే రాబోయే సినిమాలకు దారి ఇచ్చినట్టవుతుంది.

భాగమతిపై భారీగా ఖర్చుపెట్టారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. దీనికి తోడు సినిమా డిలే అవ్వడంతో ఖర్చులు ఇంకాస్త పెరిగాయి. అటుఇటుగా ఈ సినిమాకు 30కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. ఇందులో 3కోట్ల రూపాయలు కేవలం భాగమతి బంగ్లా నిర్మించడానికే అయ్యాయి.సినిమా బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే ఈ వీకెండ్ కూడా గట్టిగా ఆడాలి. మరి అప్పటివరకు భాగమతి థియేటర్లలో తన పట్టు నిలుపుకుంటుందో లేదో చూడాలి. ఓవర్సీస్ లో క్లిక్ అవ్వడం ఈ మూవీకి కలిసొచ్చిన అంశం.