అనూ ఇమ్మాన్యుయేల్‌.. అప్పుడూ.. ఇప్పుడూ.!

తెలుగులో విడుదలైన తొలి సినిమా ‘మజ్ఞు’. అయితే, అంతకన్నా ముందే ఆమె మరో సినిమాకి కమిట్‌ అయ్యింది. అదే ‘ఆక్సిజన్‌’. సినిమా విడుదల కొంత ఆలస్యమయ్యిందనీ, అయితే తెలుగులో తొలి సినిమా షూటింగ్‌ తొలి రోజు తనకింకా గుర్తుందని అనూ ఇమ్మాన్యుయేల్‌, ఆనాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుంది. అప్పట్లో తనకు తెలుగులో ఒక్క పదం కూడా తెలియదని చెప్పుకొచ్చింది అనూ ఇమ్మాన్యుయేల్‌. ఇప్పుడు మాత్రం అనూ తెలుగులో గలగలా మాట్లాడేస్తోంది.

మలయాళ హీరోయిన్లతో వున్న ఫ్లెక్సిబిలిటీ ఇదే. తెలుగులో మాట్లాడటానికి చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తారు. నిత్యామీనన్‌ అయితే తెలుగులో పాటలు కూడా పాడేసింది. అనుపమ పరమేశ్వరన్‌ అయినా, నివేదా థామస్‌ అయినా.. తెలుగులో ఎంచక్కా మాట్లాడేస్తున్నారిప్పుడు. ఆ కోవలోకే చేరిపోయింది అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా.

‘ఆక్సిజన్‌’ సినిమా ప్రారంభోత్సవానికీ, ఆ సినిమా విడుదలకీ మధ్య ఆమె హీరోయిన్‌గా చాలా కెరీర్‌ని చూసేస్తోంది. మధ్యలో ‘మజ్ను’, ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ తదితర సినిమాల్లో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్‌, పవన్‌కళ్యాణ్‌ సరసన ఓ సినిమాలోనూ, అల్లు అర్జున్‌ సరసన ‘నా పేరు సూర్య’ సినిమాలోనూ నటిస్తోన్న విషయం విదితమే.

కొత్త హీరోయిన్‌, స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిందిగానీ.. తొలి సినిమా మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఒక్కోసారి సినీ పరిశ్రమలో ఇలాంటివి మామూలే. హీరోలకీ ఇలాంటివి తప్పవు. చిరంజీవికి అదే జరిగింది. సాయిధరమ్‌ తేజ తొలి సినిమా కంటే ముందే రెండో సినిమా విడుదలయ్యింది. సో, అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా ‘ఆక్సిజన్‌’ సినిమా విడుదల ఆలస్యం కావడం పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నమాట. ఆ కాన్ఫిడెన్స్‌ ఆమె మాటల్లో కూడా కన్పిస్తోంది లెండి.

అన్నట్టు, అనూ ఇమ్మాన్యుయేల్‌ ‘ఆక్సిజన్‌’ సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌లో రెడ్‌ హాట్‌గా కన్పించి, అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుందండోయ్‌.!