అరవలేరు: తేలు కుట్టిన తెలుగుదేశం!

అమెరికా పర్యటనను ఆస్వాధించాల్సిన చంద్రబాబుకు, దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన తెలుగుదేశానికి పెద్దగా ప్రశాంతత లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులకు తెలుగుదేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మామూలుగా ఈ వ్యవహారంలో అయినా తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి అలాగిలాగా ఉండదు. తమ మీద ఒక రాయి పడే లోపు అవతల వాళ్ల మీద వంద రాళ్లు వేసేయడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత.

దీని కోసమని తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రత్యేకమైన బలం, బలగం ఉంది. తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ లు అయితేనేం.. మీడియా వర్గాలు అయితేనేం.. టీడీపీ ప్రత్యర్థి వర్గాన్ని చిన్నాభిన్నం చేసేంత వరకూ నిద్ర పోదు. కానీ రేవంత్ విషయంలో మాత్రం తెలుగుదేశం గొంతులు పెగలడం లేదు. మారు మాట్లాడటం లేదు. లోకేష్ బాబు, దేవినేని ఉమ.. వంటి వాళ్లు అయితేనేం, రేవంత్ మాటల్లో నలిగిన పరిటాల, పయ్యావుల, యనమలలు అయితేనేం.. ఆ టీడీపీ నేత మాటలపై మారు మాట్లాడలేదు ఇంత వరకూ.

రేవంత్ మాటల్లో ఎంత సత్యముంటే కానీ ఈ నేతలు ఇంత కామ్ గా ఉంటారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. రేవంత్ రెడ్డి చెప్పినట్టు.. ఏపీ తెలుగుదేశం నేతలు తమ వ్యాపారాల్లో, వ్యక్తిగత వ్యవహారాల్లో కేసీఆర్ సహకారం పొందుతూ ఉండకపోతే ఎంత హడావుడి చేసేవాళ్లు? రేవంత్ రెడ్డి మాటల సెగతో వీళ్లు పీకి పందేరేసే వాళ్లు. ఒకరి తర్వాత మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ పై దుమ్మెత్తిపోసే వాళ్లు. ఆ వ్యవహారమే వేరుగా ఉండేది.

అయితే ఇప్పుడు టీడీపీ నేతల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లే మారింది. అరవలేరు… కరవలేరు! లేదు.. రేవంత్ మాటలన్నీ అబద్ధం, అతడు చెప్పినట్టుగా ఏమీ జరగడం లేదు అనే మాటే తెలుగుదేశం నుంచి వినిపించడం లేదు. చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో మొత్తం ఐదు మందికి పార్టీ బాధ్యతలు అప్పగించి వెళ్లాడట. లోకేష్ బాబు మరో నలుగురు నేతలు ఇక్కడి వ్యవహారాలను సమీక్షిస్తున్నారట.

ఇలాంటి సమయంలో రేవంత్ రూపంలో ఇంత పెద్ద ఉత్పాతం వస్తే.. వీళ్లు కామ్ గా ఉన్నారు. అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి! మొత్తానికి రేవంత్ రెడ్డి మాటలు.. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే… తెలుగుదేశం పైకి చూపిస్తున్న రూపం వేరు, లోపలి కథలు వేరు.. అనే విషయంపై ఇప్పుడు ఏపీ జనాల మధ్యన చర్చ జరుగుతోంది. దీన్ని మరింతగా కెళికితే కంపే అని తెలుగుదేశం నేతలు కామ్ గా ఉన్నట్టున్నారు!