ఆయనంటే నాకిష్టం: సోనమ్‌కపూర్‌

పాకిస్తానీ నటుడు ఫవాద్‌ ఖాన్‌, బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించాడు. వీటిల్లో సోనమ్‌కపూర్‌ సరసన నటించిన ‘కూబ్‌సూరత్‌’ ఒకటి. ఇంకో సినిమా ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’. మొదటి సినిమాకి పెద్దగా సమస్యలేమీ లేవుగానీ, రెండో సినిమా ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ మాత్రం వివాదాల్ని ఎదుర్కొంది. ఆ తర్వాత ఫవాద్‌ ఖాన్‌ మళ్ళీ బాలీవుడ్‌ తెరపై కన్పించలేదు. ‘యూరి’ టెర్రర్‌ ఎటాక్‌ తర్వాత, పాకిస్తానీ నటీనటులపై బాలీవుడ్‌లో అనధికారిక బ్యాన్‌ కొనసాగుతున్న విషయం విదితమే.

ఈ పరిస్థితుల్లో సోనమ్‌కపూర్‌, ఫవాద్‌ఖాన్‌తో ‘కూబ్‌సూరత్‌’ సినిమా టైమ్‌లోని ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వివాదాస్పదమయ్యింది. సోషల్‌ మీడియాలో ట్రాలింగ్‌ ఓ రేంజ్‌లో జరుగుతోందిప్పుడు. అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా సోనమ్‌కపూర్‌పై కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. మరోపక్క, పాకిస్తానీ అభిమానుల నుంచి మాత్రం ఆమెకు భలే మద్దతు దొరుకుతోంది.

ఈ ట్రాలింగ్‌పై స్పందించిన సోనమ్‌కపూర్‌, ‘సహ నటుడిగా ఆయన (ఫవాద్‌ ఖాన్‌) అంటే నాకిష్టం. మంచి వ్యక్తిత్వం వున్నవాడు.. పైగా, మంచి స్నేహితుడు కూడా. అయినా, సహ నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే తప్పేంటి.?’ అంటూ ఎదురు ప్రశ్నించింది. తన దేశభక్తిని ఎవరూ శంకించలేరనీ, సినిమా వంటి విషయాల్లో రాజకీయపరమైన వివాదాల్ని తెరపైకి తీసుకురావడం సబబు కాదని సోనమ్‌కపూర్‌ అంటోంది.

‘ఇరుదేశాల ప్రజల మధ్యా ఎలాంటి విధ్వేషాల్లేవు.. ఆ విధ్వేషాలు కొందరికే పరిమితం.. సినిమా ఓ కళా రంగం.. వ్యాపారం.. అందులోకి ఈ తరహా వివాదాలు మంచిది కాదు..’ అంటూ సోనమ్‌కపూర్‌ తాను చేసిన పనిని సమర్థించుకుంది.