ఆస్తుల స్వాధీనం.. చంద్రబాబుతోనే మొదలవ్వాలి.!

‘ఏసీబీ కేసుల్లో అవినీతి బట్టబయలయినప్పుడు, వారి ఆస్తుల్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది..’

– ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారి తాజా ఉవాచ.

నిజానికి, ఈ తరహా వ్యాఖ్యల్ని చంద్రబాబు ఎప్పటినుంచో చేస్తున్నారు. అవినీతిపరుల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెబుతూ, జగన్‌ పేరుని చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్న విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌పై చంద్రబాబు విమర్శలు కొత్తేమీ కాదు. జగన్‌ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని గడచిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబు చెబుతూనే వున్నారు. ఇప్పటిదాకా, ఆస్తుల స్వాధీనం ఏమన్నా జరిగిందా.? అంటే, అదీ లేదాయె.!

అసలంటూ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్‌ని దోషిగా ఇప్పటిదాకా ఏ న్యాయస్థానమూ తేల్చలేదు. కానీ, చంద్రబాబు మాత్రం అప్పుడే ‘ఆస్తుల స్వాధీనం’ అంటూ ప్రచారం షురూ చేసేశారు. మూడున్నరేళ్ళుగా ఇదే తంతు. తాజాగా మరోమారు చంద్రబాబు ‘ఆస్తుల స్వాధీనం’ అంశాన్ని తెరపైకి తెచ్చారు.

నిజానికి, ‘ఆస్తుల స్వాధీనం’ అనే చర్య చేపట్టాల్సి వుంటే, ముందుగా అది చంద్రబాబుతోనే మొదలవ్వాలేమో.! ఎందుకంటే, ఓటుకు నోటు కేసులో, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అడ్డంగా బుక్కయిపోయారు. అందులో ఒకాయన రేవంత్‌రెడ్డి, రెడ్‌ హ్యాండెడ్‌గా తెలంగాణ ఏసీబీకి దొరికిన విషయం విదితమే. ఈ మొత్తం వ్యవహారానికి ‘బ్రీఫింగ్‌’ చేసింది స్వయానా చంద్రబాబే.!

ఇప్పుడంటే రేవంత్‌రెడ్డి, టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారుగానీ, ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బుక్కయ్యాక, అతన్ని రాజకీయంగా ప్రమోట్‌ చేసింది, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కట్టబెట్టిందీ చంద్రబాబేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! గురవింద గింజ సంగతేమోగానీ, చంద్రబాబు చెప్పే నీతులకీ ఆయన వెనకాల ‘ఈ తరహా మచ్చలకీ’ లోటే వుండదు. దటీజ్‌ చంద్రబాబు.!