ఇది వైకాపా కార్యాలయం ప్రభావమా?

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాటల మరాఠీ అంటుంటారు. జనాలను మాటలతో బురిడీ కొట్టిస్తారని, ఆకర్షణీయంగా మాట్లాడగల సామర్థ్యముందని చెబుతుంటారు. ఇది వాస్తవమే. కేసీఆర్‌ను ఒక్కడినే ఎందుకనుకోవాలి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సేమ్‌ టైపు. ఈయన కేసీఆర్‌లా ఆకర్షణీయంగా మాట్లాడలేరుగాని అరచేతిలో వైకుంఠం చూపించడంలో, అప్పటికప్పుడు పనులు చేసేస్తున్నట్లు, సమస్యలు పరిష్కరించేస్తున్నట్లు హడావుడి చేయడంలో దిట్ట. తీరా చూస్తే ఆయన ఆదేశించిన పనుల్లో సగం కూడా పూర్తి కావు. ‘నా ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడంలేదు’ అంటూ కొన్నాళ్ల తరువాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

మొన్నీమధ్య ఆకస్మికంగా విజయవాడలో పర్యటించారు. తనిఖీలు చేశారు. నగరాన్ని త్వరలోనే బ్రహ్మాండంగా మార్చేస్తామన్నట్లుగా హడావుడి చేశారు. సింగపూర్‌లోని రోడ్లను తలదన్నేలా నగరంలో రోడ్లు నిర్మించాలన్నారు. నగరంలో జలమార్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నాలుగు కాల్వల్లో ప్రజలు ఆనందంగా బోటు షికారు చేయాలన్నారు. ‘నగరంలోని రోడ్లపై గుంతలనేవి కనిపించకూడదు. మళ్లీ వచ్చి తనిఖీలు చేస్తా’ అని చెప్పారు. హైదరాబాదులోని పాలకులూ ఇలాగే చెప్పి చాలా కాలమైంది. ఇంకా గుంతలు ఎక్కువయ్యాయిగాని తగ్గలేదు. చినుకు పడితే అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఇక్కడా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందా?

చాలా పనులకు ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు ‘రౌడీయిజాన్ని సహించను’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి హెచ్చరికలు చేయడం మామూలే. ఈ ధోరణి చూసి ఈయనెంత కఠినంగా వ్యవహరిస్తారోనని అనుకుంటారు. అలాంటిదేమీ ఉండదు. అధికార పార్టీ నాయకుల రౌడీయిజాన్ని చక్కగా సహిస్తారు. వీరు అధికారులను కొట్టినా చర్యలుండవు. పైగా దెబ్బలు తిన్న అధికారులనే మందలిస్తారు. టీడీపీ నాయకులపై పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను ఎత్తేయించిన చంద్రబాబు రౌడీయిజాన్ని సహించనని చెప్పడం హాస్యాస్పదం.

సరే..ఇదంతా ఇలా ఉంటే ఇంతకూ ముఖ్యమంత్రి విజయవాడలో రకరకాల పనులు పురమాయించి హడావిడిగా తిరగడానికి కారణం ఏమిటి? ఇది ఆయన బాధ్యత కాబట్టి తిరిగారని అనుకోవచ్చు. కాని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం… విజయవాడలో ఈమధ్యనే రాష్ట్ర కార్యాలయం ప్రారంభించిన వైకాపా నాయకులు నగర సమస్యలపై దృష్టి పెట్టారు. అపరిష్కృత సమస్యలను పరిశీలిస్తున్నారు. వచ్చేనెల రెండో తేదీ నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతోంది కదా. అంతేకాకుండా జగన్‌ ఆంధ్రాలోనే ఉండి విజయవాడ నుంచే కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నారు.

అందుకే జగన్‌ పాదయాత్రకు ముందే ముఖ్యమంత్రి విజయవాడలో పర్యటించారు. నగరానికి చెందిన టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్‌ రావు, జలీల్‌ ఖాన్‌, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు సమస్యలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఇదంతా తెలుసుకున్న చంద్రబాబు తానే స్వయంగా నగరానికి వచ్చి ప్రభుత్వం ఏదో చేయబోతున్నదనే ఫీలింగ్‌ కలిగించారు. ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు సీఎం చేయాల్సి వస్తోందని ఓ నాయకుడు వ్యాఖ్యానించాడు. జగన్‌ పాదయాత్ర ప్రజలపై ప్రభావం చూపుతుందనే భయం టీడీపీ నాయకులకు ఉందని చెప్పొచ్చు.