ఈయనలాంటివారు ఎందరో…!

ఒక పార్టీలోని పెద్ద నాయకులు, సీనియర్‌ నేతలు మరో పార్టీలోకి వెళ్లినప్పుడు వారి వెంట మరికొందరు నాయకులూ వెళ్లిపోవడం మామూలే. పెద్ద నాయకులు ఏవో పదవులు పొందుతారు. వారి వెంట వెళ్లివారిలో కొందరికి ప్రాధాన్యం దక్కదు. కొందరు బడా నాయకులనే పట్టించుకోనప్పుడు మిగతా నాయకులను ఏం పట్టించుకుంటారు? అలాంటప్పుడు కుతకుత ఉడికిపోతూ ఎప్పుడో ఒకప్పుడు మరో పార్టీకి ఫిరాయిస్తారు. టీడీపీలో పుట్టి పెరిగి, పదవులు అనుభవించి, తరువాత టీఆర్‌ఎస్‌లో చేరిన పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెసులోకి జంప్‌ చేయబోతున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రముఖ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బాగా సన్నిహితుడైన పోట్ల ఎందుకు పార్టీ మారబోతున్నారు? ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార పార్టీలో చేరతారు. ఇబ్బందులెదురైనా సర్దుకుంటారు.

కాని ‘నేను టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నాను’ అని చెప్పారు పోట్ల. ఈయన జంపింగ్‌కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దానికి మొదటి దెబ్బ పోట్ల రూపంలో తగులుతోంది. టీఆర్‌ఎస్‌ నుంచి వలస ఊహించని పరిణామం. మరి ఇది ఈయనతో ఆగుతుందా? ఇంకా కొనసాగుతాయా? ఎన్నికల సమయానికి సంభవించే పరిణామాలబట్టి వలసలు ఉంటాయని చెప్పొచ్చు. పారిశ్రామికవేత్త, ఇంజినీరింగ్‌ కాలేజీ అధిపతి అయిన పోట్ల టీడీపీ పుట్టగానే అందులో చేరారు. ఉమ్మడి ఏపీలో యువశక్తి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా, ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైస్‌ ఛైర్మన్‌గా చేశారు. 2009 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ఏడాదే టీఆర్‌ఎస్‌లో చేరిన పోట్లకు అప్పుడే తత్వం బోధపడినట్లుంది. పార్టీలో చేరగానే దేవుడిలా కనబడిన సీఎం కేసీఆర్‌, ఆ తరువాత ఆయన కళ్లకు నిజాం రాజులా కనిపించారు.

అలా కనబడిన తరువాత రేవంత్‌ రెడ్డితో, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరితో మాట్లాడి కాంగ్రెసులో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి పోట్ల మాదిరిగా అసంతృప్తి చెందుతూ బయటపడాలనుకునేవారు టీఆర్‌ఎస్‌లో చాలామంది ఉన్నారు. ఒకప్పుడు టీడీపీలో, కాంగ్రెసులో పదవులు అనుభవించి, రాజకీయంగా ఎదిగిన అనేకమంది రాష్ట్ర విభజన తరువాత టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇందుకు కారణం పదవులు, ఇతర ప్రయోజనాలని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైకి మాత్రం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి వెళుతున్నామని, బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములం కావడానికి వెళుతున్నామని కాకమ్మ కబుర్లు చెప్పారు.

టీడీపీలో వెలిగిపోయిన ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెసులో దిగ్గజాలుగా ఎదిగిన కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్‌ అలియాస్‌ డీఎస్‌ తదితరులు గులాబీ పార్టీలో గమ్మున కూర్చుండిపోయారు. కొద్దిమంది ఫిరాయింపుదారులు అందలం ఎక్కారు తప్ప (మంత్రి పదవులు) చాలామంది ఈనాటివరకు ఖాళీగానే ఉండిపోయి ‘ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే’ అని పాడుకుంటున్నారు. ఫిరాయించిన కొత్తల్లో అధినేతను ఆకాశానికెత్తిన నాయకులు ఆ తరువాత జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు.

ముఖ్యమంత్రులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రతివిమర్శలు చేయడంలేదు. మంచి పనులు చేసినా పొగడటంలేదు. అంటే ఫిరాయింపుదారుల్లో ఒక విధమైన నిర్లిప్తత ఆవరించిందన్నమాట. ఒరిజినల్‌ నాయకులు, ఫిరాయింపుదారుల్లో సీనియర్లయినవారు జూనియర్‌ ఫిరాయింపుదారులకు విలువ ఇవ్వడంలేదు. అసలు నాయకులకు, ఫిరాయింపుదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నియోజవర్గాల సంఖ్య పెరుగుతుందో లేదో, టిక్కెట్లు దొరుకుతాయో లేదో తెలియదు. అనేకమంది కక్కలేక మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.