ఈవారం ట్రేడ్‌ టాక్‌

‘అదిరింది’ మినహా గత వారం విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించలేకపోయాయి. తమిళంలో ఘన విజయం సాధించడం, వివిధ కాంట్రవర్సీలకి తెర లేపడంతో విజయ్‌ సినిమా పట్ల ఎప్పుడూ లేని ఆసక్తి నెలకొంది. దీనిని అదిరింది బాగా క్యాష్‌ చేసుకుంది.

విజయ్‌కి తెలుగులో తొలి విజయంగా నిలిచిన అదిరింది మొదటి వారాంతం తర్వాత పెద్దగా ప్రభావం చూపించకపోయినా కానీ మిగతా సినిమాలతో పోలిస్తే మెరుగనిపించింది. సందీప్‌ కిషన్‌కి మరోమారు చుక్కెదురైంది. కేరాఫ్‌ సూర్య చిత్రం కలక్షన్ల పరంగా డిజాస్టర్‌గా నిలిచింది. మంచు మనోజ్‌కి కూడా ఒక్కడు మిగిలాడుతో చుక్కలు కనిపించాయి.

‘పిఎస్‌వి గరుడ వేగ’ చిత్రానికి ప్రశంసలే తప్ప అందుకు తగ్గ వసూళ్లు రావడం లేదు. వచ్చే నెల నుంచి భారీ సినిమాల తాకిడి వుండడంతో చిన్న నిర్మాతలంతా ఇప్పుడే అదృష్టం పరీక్షించుకుంటున్నారు. దీంతో ఈ శుక్రవారమే ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయి. అయితే వీటిలో అనువాద చిత్రాలైన ఖాకి, గృహం తప్ప మిగతావేవీ అంతగా ఆకర్షించడం లేదు.