ఈ బురిడీ మాటల్ని జనం నమ్ముతారా?

ఒక వర్గానికి నిర్దిష్టంగా ఒక హామీ ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే వరకు ఇతరత్రా మాయమాటలతో వారిని నమ్మించడం కష్టం. పాలకపక్షం వారిని తమ ఎన్నికల విజయానికి నిచ్చెన మెట్లుగా వాడుకోవడానికి వారిలో ఒక ఆశ కల్పించి, అధికారంలోకి రాగానే దాన్ని గురించి పట్టించుకోకుండా, ఆ ఆశ కాస్తా ఉద్యమ రూపాన్ని సంతరించుకున్న తర్వాత కూడా దాన్ని తీర్చడం గురించి గట్టిగా పట్టించుకోకుండా… బురిడీ మాటలతో నమ్మించాలనుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారినట్లుంది.

కాపులకు రిజర్వేషన్ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. ఎన్నాళ్లుగా కాలయాపన చేస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యంలో.. ఈ ప్రభుత్వం త్వరలోనే తాము కాపులకు ఏం చేయబోతున్నామో.. చాటిచెప్పడానికి ఓ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నదట. కాపులకు సంబంధించి వారిలో ఆశలు రేపిన అసలు హామీ రిజర్వేషన్ సంగతి తేల్చకుండా.. ఎన్ని ప్రగల్భాలు పలికితే మాత్రం లాభం ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రిజర్వేషన్ కోసం కాపుల ఆశ అనేది ఉద్యమం, పోరాటం రూపంలోకి మారకుండా ఉన్నట్లయితే.. చంద్రబాబునాయుడు దాని గురించి ఏమాత్రం పట్టించుకుని ఉండేవారో చెప్పడం కష్టం. అయితే కాపు కార్పొరేషన్ అంటూ ఒకటి ఏర్పాటుచేసి.. దానికి నిధులు ప్రకటించి.. కాపు యువతను విదేశాలకు పంపిస్తూ.. వారి జీవితాలకు స్థిరత్వాన్ని ఇచ్చే అసలైన రిజర్వేషన్ గురించి వాళ్ల ఆలోచనను పక్కకు మళ్లించడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ వ్యాఖ్యలు వింటే అదే అర్థమవుతుంది. కాపులకు ప్రభుత్వం ఏం చేసేసిందో చాటి చెప్పేలా కాపు కార్పొరేషన్ ఒక బ్రోషర్ ను రూపొందించింది. దానిని ఆయన ఇవాళ విడుదల చేశారు. కాపు కార్పొరేషన్ కు కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా కాపు కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే కాపులకోసం ప్రభుత్వం ఎంత ఘనమైన సేవలు, తోడ్పాటు అందించిందో తెలియజెప్పడానికి త్వరలో ఓ బహిరంగ సభ పెడతాం అని కూడా సెలవిస్తున్నారు.

నిజానికి రామానుజయ ఆధ్వర్యంలో గతంలో కూడా ఇలాంటి ప్రయత్నమే ఒకటి జరిగింది. కాపు ప్రతినిధుల్ని ఆహ్వానించి బెజవాడలో చంద్రబాబుతో ఓ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలో రిజర్వేషన్ గురించి అధికారిక ప్రకటన వచ్చేస్తుందని అంతా ఆశగా వచ్చారు… బాబు యథారీతిగా.. ‘‘త్వరలోనే నివేదిక వస్తుంది.. సంగతి తేలుస్తాం’’ అనే పడికట్టు మాటలు వాడారు. అంతా నిరాశగా వెళ్లారు.

ఇప్పుడు రామానుజయ ఎంత పెద్ద బహిరంగ సభ పెట్టినా సరే.. చంద్రబాబునాయుడు నిర్దిష్టంగా రిజర్వేషన్ ను ప్రకటించకుండా కాపు వర్గం నమ్మకాన్ని సంపాదించడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. ‘త్వరలోనే మంజునాధ కమిషన్ నివేదిక వస్తుంది’ అనే మాటను కొన్ని నెలల తరబడి ప్రభుత్వంలోని వారంతా చెబుతూ.. కాపుల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.