ఒకటి తీరింది… మరో రెండు కోరికలు?

‘కోరిక తీరెను హాయిహాయిగా… వేడుక జరగాలి తీయతీయగా’..అని పాడుకుంటున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు. విషయం తెలిసిందే కదా…పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధ్యక్షుడు కాబోతున్నారు. దీంతో తెలుగు టీవీ ఛానెళ్లలో జరుగుతున్న చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల కాంగ్రెసు నాయకులు యమ హుషారుగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

సరే.. వారి ఆశలు వారివి. కాదనలేం కదా. రాహుల్‌ని అధ్యక్షుడిని చేయాలని తల్లి సోనియా గాంధీ కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తున్నాయి. ఏవేవో కారణాలు చెప్పి ఇంతకాలం వాయిదా వేసిన రాహుల్‌కు ఇక బాధ్యత మోయక తప్పడంలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీకి ఓపిక తగ్గిపోయింది. రాహుల్‌ అప్పుడు పీఠమెక్కుతాడు.. ఇప్పుడు పీఠమెక్కుతాడంటూ ముహూర్తాలు నిర్ణయించడం, ఆ టైమ్‌ వచ్చేసరికి సీన్‌ మారిపోవడం..ఇదంతా ప్రహసనంలా జరిగింది.

అధ్యక్ష పదవికి ఏదో పదిమంది పోటీ పడుతున్నట్లుగా మధ్య మధ్య బిల్డప్‌ ఇచ్చారు. కాంగ్రెసులో మరొకరు పోటీ పడటం జరుగుతుందా? అయినప్పటికీ ఈ కథను టీవీ సీరియల్లా చాలా ఏళ్లు సాగదీశారు. పైకి రాహుల్‌ అధ్యక్షుడిగా కనబడినా వెనక తల్లి సలహాలు, సూచనలు తప్పనిసరిగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆమె కల్పించుకోలేదు.

ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రచారం ప్రారంభించిన సోనియా గాంధీ హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఎన్నికలకు పూర్తిగా దూరమయ్యారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే విదేశాలకు వెళ్లిన ఆమె హడావుడంతా ముగిశాక తిరిగొచ్చారు. ఈ దశలో రాష్ట్రపతి ఎన్నికపై చర్చ మొదలై ప్రతిపక్షాల్లో కదలిక వచ్చింది. అన్ని ప్రతిపక్షాలను కూడగట్టి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించాల్సివచ్చింది.

దీంతో ఈ విషయంలో కీలక పాత్ర పోషించే బాధ్యత ప్రతిపక్ష నాయకులు ఆమె మీద పెట్టారు. చివరకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా పోటీకి పెట్టాయి. అలాగే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేయడంలోనూ సోనియా కీలక పాత్ర పోషించారు. ఈ రెండు విషయాల్లో రాహుల్‌ గాంధీ పాత్ర ఏమీ లేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని అందరికీ తెలిసిందే. కాని ప్రతిపక్షాలను ఒక వేదిక మీదికి తీసుకురావడంలో సోనియా ప్రయత్నాలను అందరూ మెచ్చుకున్నారు. ఇంత చొరవ, సామర్థ్యం రాహుల్‌ గాంధీకి లేదనేది కాంగ్రెసులోని, ప్రతిపక్షాల్లోని నాయకుల అభిప్రాయం.

అయితే ఎన్‌డీఏలో భాగస్వామి అయిన శివసేన రాహుల్‌ను మెచ్చుకుంది. ఆయనలో నాయకత్వ లక్షణాలు పెరిగాయని, ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఢీకొట్టే సామర్థ్యం ఉందని కితాబిచ్చింది. ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీ ఈ విధంగా కితాబివ్వడంతో కాంగ్రెసులోనూ యువరాజు పట్ల నమ్మకం పెరిగింది. రాహుల్‌లో మార్పు వచ్చినట్లు మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉంటే, కుమారుడు కాంగ్రెసు అధ్యక్షుడు కావాలనే సోనియా కోరిక తీరింది.

ఈ కోరిక తీరడం వెనక ఎలాంటి కష్టమూ లేదు. మరో రెండు కోరికలు తీరుతాయో లేదో తెలియదు. ఒకటి రాహుల్‌ ప్రధాని కావడం, రెండు వివాహం జరగడం. 47 ఏళ్ల ఈయన అవివాహితుడిగా మిగిలిపోవడం నాయకులకు బాధ కలిగిస్తోంది. కాని ఆయన మనసులో ఏముందో తెలియదు. ఈ రెండు వేడుకలు కళ్లార చూడాలని పార్టీలోని వృద్ధ నాయకులు తపిస్తున్నారు.

వివాహం రాహుల్‌ చేతిలోని పని. ఆయన తలచుకుంటే అవుతుంది. ఆయన లవ్‌ స్టోరీ గురించి చాలామందికి తెలుసు. కాని…ఎందుకు కంచికి చేరలేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. రాహుల్‌ ప్రియురాలి పేరు వెరోనికా అని, ఆమె స్పెయిన్‌కు చెందిన యువతి అని, రాహుల్‌ ఆమెనే పెళ్లి చేసుకుంటాడని చాలా కాలం ప్రచారం జరిగింది. ప్రధాని పదవి అధిష్టించడం అనేది ప్రజల నిర్ణయం ప్రకారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తే రాహులే ప్రధాని . ఆయనతో ఎవ్వరూ పోటీ పడరు.

వివాహం, ప్రధాని పదవి.. ఈ రెండు సాధిస్తే సోనియాకు సంతృప్తి. ఇక అధ్యక్షుడు కాబోతున్న రాహుల్‌ ఓ ప్రత్యేకత సాధించారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు కాబోతున్న తొలి స్వతంత్ర భారతీయుడు. అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చాక (1970) జన్మించారు. జవహర్‌లాల్‌, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా స్వాతంత్య్రం రాకముందు జన్మించారు. వీరిమాదిరిగానే యాభై ఏళ్లు నిండకముందే అధ్యక్షుడవుతున్నారు. కాకపోతే వారికంటే ఈయన అధ్యక్షుడు కావడంలో జాప్యం జరిగింది.