ఔనా.. వాళ్ళంతా టీడీపీలోనే వున్నారా.?

టీడీపీని అక్షయ పాత్రతో పోల్చేయ్యాలేమో.! ఎందుకంటే, టీడీపీ నుంచి నేతలు బయటకు వెళుతున్న కొద్దీ.. ఇంకా టీడీపీలో ముఖ్య నేతలనదగ్గరవారి పేర్లు తెరపైకి వస్తూనే వున్నాయి. ఇది తెలంగాణ వ్యవహారం. కేసీఆర్‌ నుంచి రేవంత్‌రెడ్డిదాకా.. టీడీపీని చాలామంది నేతలు వీడారు.. వీడుతూనే వున్నారు. ఒకప్పటి వ్యవహారం వేరు.. గడచిన నాలుగైదేళ్ళ వ్యవహారం వేరు. ఈ నాలుగైదేళ్ళలో తెలుగుదేశం పార్టీ చాలా దారుణమైన దెబ్బల్ని తినేసింది తెలంగాణలో.

‘పాత నీరు పోతే, కొత్త నీరు వస్తుంది..’ అని పదే పదే చంద్రబాబు ఓ మాట చెప్పేవారు. పాత నీరు పోతోందిగానీ, కొత్త నీరు మాత్రం రావడంలేదాయె. టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు టీడీపీకి నిఖార్సుగా మిగిలింది ఒక్కరే. ఇంకొకరు వున్నా, ఆయన టీడీపీతో చిత్రమైన ‘దూరం’ పాటిస్తున్నారు. ఆయనే ఆర్‌.కృష్ణయ్య. నిఖార్సుగా మిగిలిన ఒక్కరూ ఎవరో కాదు, సండ్ర వెంకట వీరయ్య.

‘ఎమ్మెల్యేలు, ఎంపీ పోతేనేం.. ముఖ్య నేతలున్నారు కదా..’ అన్న సంతోషమూ టీడీపీకి మిగిలేలా లేదు. చంద్రబాబు, ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాలకి పంపిన లిస్ట్‌ చూస్తే, ‘అబ్బో, ఇంకా టీడీపీలో ముఖ్యనేతలనబడ్డవారు వున్నారే.!’ అని ఆశ్చర్యం కలగకమానదు. ఆ లిస్ట్‌లోనివారంతా ఇప్పటికే రేవంత్‌తో ఓ అవగాహనకు వచ్చేశారు. లిస్ట్‌ ఢిల్లీకి వెళ్ళిందంటే, వాళ్ళంతా టీడీపీని వీడడం ఖాయమే.

రేపు సాయంత్రమే ముహూర్తం.. ఆ తర్వాత పరిస్థితి ఏంటట.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. ఎందుకంటే, ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ జెండా మోయడానికి కూడా ఎవరూ కన్పించకపోవచ్చు. అరవింద్‌కుమార్‌గౌడ్‌, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌.. ఇలా ఒకరిద్దరు నేతలు కన్పించినా, వాళ్ళూ ఎక్కువ కాలం టీడీపీలో వుండే అవకాశం లేదు.