కమల్ హాసన్ పై మరో కేసు

నీలవేంబు కుదినీర్ అనే మందుపై రెండు రోజుల కిందట కమల్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ మందును పంపిణీ చేయొద్దంటూ తన అభిమానులకు పిలుపునిచ్చాడు కమల్. ఈ మందులోని ఓ కారకం మనుషుల్లో వంధ్యత్వానికి (ఇన్-ఫెర్టిలిటీ) దారితీస్తుందని కమల్ ఆరోపించాడు.

ఈ ఆరోపణలు కమల్ పై కేసు నమోదయ్యేలా చేశాయి. కమల్ వ్యాఖ్యలు తమ హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయంటూ ఈ మందు పంపిణీ సభ్యుల్లో ఒకరు చెన్నై కమిషనరేట్ కు ఫిర్యాదు చేశాడు. మనుషుల భయాల్ని కమల్ క్యాష్ చేసుకుంటున్నారని, తమిళనాడుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తన ఫిర్యాదులో ఆరోపించాడు సదరు సామాజికవేత్త.

డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు నీలవేంబు చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన కషాయాన్ని ఇస్తున్నారు. ఇది వాడడం వల్ల మనుషులు నపుంసకులుగా తయారవుతారని కమల్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కమల్ వ్యాఖ్యల్ని ఖండించింది. ఈ కషాయం వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటోంది. అయితే తగిన రీసెర్చ్ చేయకుండా కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అంటున్నారు అతడి అభిమానులు.