కరోనా ఎఫెక్ట్.. నర్సుగా మారిన నటి

కరోనా వైరస్ కారణంగా బయట డాక్టర్లు, పోలీసులు ప్రాణాల్ని పణంగా పెట్టి జనం కోసం పోరాటం సాగిస్తున్నారు. వాళ్లకు సామాన్య జనం వెళ్లి సాయం చేయాల్సిన అవసరం లేదు. ఇంటి పట్టున ఉండి కరోనా వ్యాప్తిని అరికడితే చాలని అంటున్నా వినకుండా జనాలు తమ వ్యక్తిగత అవసరాల కోసం బయట తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక సినీ నటి.. బాధ్యతతో జనం కోసం నర్సు అవతారంలోకి మారి స్ఫూర్తినిస్తోంది. షారుఖ్ ఖాన్ సినిమా ‘ఫ్యాన్’లో ఓ పాత్ర చేసిన ఆ నటి పేరు.. షికా మల్హోత్రా. ముంబయిలోని ఓ హాస్పిటల్లో ఆమె నర్సుగా మారి కరోనా పాజిటివ్ కేసుల బాధితులకు సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రం మహారాష్ట్రనే అన్న సంగతి తెలిసిందే. అక్కడ డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. షికా మల్హోత్రా సినిమాల్లోకి రావడానికి ముందు ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ డిగ్రీ చేసింది. ఆమెకు నర్సుగా సేవలందించే అర్హత ఉంది. ఐతే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి సెలబ్రెటీగా మారిన షికా.. ఇప్పుడు ఈ కష్ట కాలంలో తన చదువుకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంది. తాను నర్సుగా సేవలందిస్తానని ఓ ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇచ్చింది. ఆమె డిగ్రీ చూసి విధుల్లోకి తీసుకున్నారు. వెంటనే పేషెంట్ల సేవలో షికా బిజీ అయిపోయింది. విరామం లేకుండా ఆమె ఆసుపత్రిలో పని చేస్తుండటం విశేషం. ఇలాంటి వారి స్ఫూర్తి, కమిట్మెంట్ చూసి అయినా జనాలు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు 200 మార్కుకు చేరువగా ఉన్న సంగతి తెలిసిందే.