కేసీఆర్ సీక్రెట్ బయటపెడ్తున్న ప్రొఫెసర్ సాబ్!

కొత్త సచివాలయం విషయంలో కేసీఆర్ ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు సచివాలయం ఉన్న ప్రాంతం, ఉన్న భవనాలు నిజంగానే అంత దరిద్రంగా, చెత్తగా ఉన్నాయా? కొత్త సచివాలయం అనేది ప్రజల సౌలభ్యం కోసం కడుతున్నారా? ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా అందమైన భవనం కోసం కడుతున్నారా? ఇలాంటి అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ.. అన్నిటినీ ఎదుర్కొనడానికే కేసీఆర్ సిద్ధపడుతున్నాడు తప్ప.. ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.

ఆయన కొత్త సచివాలయం కట్టేస్తారు సరే.. మరి ప్రస్తుతం ఉన్న దాని మాటేమిటి? సరిగ్గా ఈ సంశయం దగ్గరే ప్రొఫెసర్ కోదండరామ్ రంగప్రవేశం చేస్తున్నారు. ఇప్పుడు సచివాలయం ఉన్న ప్రాంతాన్ని కార్పొరేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేశారంటూ.. ఆయన హెచ్చరిస్తున్నారు. ఆ స్థలాన్ని ధారాదత్తం చేసి లబ్దిపొందాలని చూస్తున్నారని అందుకే కొత్త సచివాలయం పాటపాడుతున్నారని ఆయన అంటున్నారు. నిజానికి సచివాలయం కోసం ఎర్రగడ్డ ఆస్పత్రి ప్రాంగణంలో కొత్త భవనాలు నిర్మించాలని అనుకున్న సమయంలో కేసీఆర్ ప్రస్తుత సచివాలయ స్థలాన్ని ఎలా వినియోగిస్తాం అనే తన ఆలోచనను అందరితో పంచుకున్నారు.

హుసేన్ సాగర్ ఒడ్డునే ఉండే ఆ విశాలమైన ఖాళీ స్థలాన్ని ప్రపంచంలోనే మనకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చే ఐకానిక్ టవర్స్ నిర్మించడానికి వినియోగిస్తాం అని ఆయన చెప్పారు. ఆకాశ జంట హర్మ్యాలు నిర్మించి.. పర్యాటక ఆకర్షణీయ స్థలంగా తీర్చిదిద్దుతాం అని ఆయన అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత మాత్రం దాని ఊసు వినిపించలేదు. ఈ స్థలం విషయంలో కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉన్నదనే ప్రచారానికి, ఇప్పుడు ప్రొఫెసర్ మాటలు బలం చేకూరుస్తున్నాయని అంతా అనుకుంటున్నారు.

నగరం నడిబొడ్డులో ఉండే ఈ స్థలాన్ని, నిర్మాణ రంగంలో ఉన్న కొందరు పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా కట్టబెట్టడానికే ఆయన ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. అవేమీ ఖాతరు చేయకుండా ఆయన మాత్రం.. బైసన్ పోలో గ్రౌండ్స్ ను రాష్ట్రప్రభుత్వానికి దక్కించుకోవడం అనే వ్యవహారంపై విపరీతంగా కసరత్తు చేసి.. ఒప్పందం దశవరకు తీసుకువచ్చారు. ఇక అప్పగింతలు జరగడం అనే లాంఛనం ఒక్కటే మిగిలి ఉంది. ఈ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం లాంటివాళ్లు.. కేసీఆర్ ప్రభుత్వంపై నిందలేసినా, ఒకవేళ అవన్నీ నిజాలే అయినా ఏం సాధించగలరు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది.