కొత్త పార్టీలు పుట్టనట్లే…!

దేశంలో ఇప్పటికే అనేక చిన్నా పెద్ద పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కొత్త పార్టీలు పుడుతూనే ఉన్నాయి. సాధారణంగా వీటిల్లో ఎక్కువ పార్టీలు దీర్ఘకాలం బతికి బట్ట కట్టవు. వీటిని మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీలని అంటుంటారు. ఐదేళ్లకోసారి సాధారణ ఎన్నికలు జరిగే సమయంలో అంటే ఎన్నికలకు ఏడాదో, ఏడాదిన్నర ముందో కొందరు నాయకులు పార్టీలు పెడుతుంటారు. ఇవి ఎన్నికల తరువాత కనబడవు.

కొందరు నాయకులు పార్టీ పెడతామని ఎప్పటినుంచో ఊరించి ఊరించి చివరకు గమ్మునుండిపోతారు. ఇలాంటివారు పార్టీ పెట్టే విషయంలో చాలాకాలం ఊగిసలాడి కథ ముగించేస్తారు. వీరిని నమ్ముకొని ఎన్నికల్లో పోరాడాలనుకున్నవారు ఉసూరుమంటారు. తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచనలు చేసి వెనక్కుపోయారు టీ-జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఒకప్పటి ప్రజాయుద్ధనౌక గద్దర్‌.

వాగ్గేయకారుడు పూర్తిగా మౌనంగా ఉండగా, ప్రొఫెసర్‌ పార్టీ పెట్టడంలేదని తాజాగా స్పష్టం చేశారు. గమ్మున ఉండటంకంటే ఏదో ఒకటి చెప్పడం మంచిది కదా. కాని పార్టీ ఆలోచన ఎందుకు మానుకున్నారో చెబితే మరింత క్లారిటీగా ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న మాటలకు భయపడి వెనక్కు తగ్గారా? లేదా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కష్టమని, చికాకులు కలుగుతాయని వద్దనుకున్నారా? తెలియదు.

ఇంతకూ కేసీఆర్‌ ఏమన్నారో గుర్తుంది కదా. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం ఘనవిజయం సాధించిన తరువాత నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరామ్‌ మీద నిప్పులు కురిపించారు. ప్రొఫెసర్‌ను పూచికపుల్ల మాదిరిగా తీసి అవతల పారేశారు. కనీస గౌరవం ఇవ్వకుండా ‘వాడు’ అంటూ మాట్లాడారు.

‘కోదండరామ్‌ కెపాసిటీ నాకు తెలుసు. వాడు చాలా చిన్నవాడు’ అన్నారు. ‘సాగరహారం వీడు చేసిండా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్‌ పాత్ర ఏమీ లేదన్నట్లుగా మాట్లాడారు. దమ్ముంటే పార్టీ పెట్టమంటూ సవాల్‌ చేశారు. జేఏసీ ముసుగు తీసేసి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి తనన ఢీకొట్టాలని సవాల్‌ చేశారు. ‘పార్టీ పెడితే తెలుస్తుంది. పార్టీ పెట్టుడంటే పాన్‌డబ్బా పెట్టుడా?’ అని రెచ్చగొట్టేలా మాట్లాడారు.

తాను పార్టీ పెట్టడంలేదని కోదండరామ్‌ ప్రకటించారంటే కేసీఆర్‌ సవాల్‌ను ఆయన స్వీకరించలేదని అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉండగా ఈమధ్య ”కోదండరామ్‌ పార్టీ ఏర్పాటు చేసి తీరుతారు. ముసుగులో గుద్దులాటలు వద్దు. ఆయనను విలేకరులు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరు. అంతా సిద్ధమైపోయింది. పార్టీకి పెట్టేందుకు మూడు నాలుగు పేర్లు సిద్ధం చేసుకున్నాం. సంక్రాంతి తరువాత కోదండరామ్‌ పార్టీని ప్రకటిస్తారు” అని ఆయన సన్నిహితులు చెప్పారు.

పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని, జాప్యం చేయవద్దని జేఏసీ నాయకులు ప్రొఫెసర్‌పై ఒత్తిడి చేశారు. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి తరువాత పార్టీ పెడతారని చెప్పినవారే ఎందుకు విరమించుకున్నారో చెబుతారా? కోదండరామ్‌ వెనక్కు తగ్గడంతో కేసీఆర్‌ ఊపిరి పీల్చుకొనివుంటారు. ఆయన పార్టీ పెట్టినా టీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేకపోవచ్చు. కాని పోటీగా మరో నాయకుడు తయారుకావడం ఇష్టం ఉండదు కదా. మావోయిస్టుల తీవ్రవాద రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్లమెంటరీ రాజకీయాలను తలకెత్తుకున్న గద్దర్‌ సొంత పార్టీ పెడతానన్నారు.

అక్టోబరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు. కాని నవంబరు ముగింపుకొస్తున్నా ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. ‘వచ్చే ఎన్నికల్లో నేను కింగ్‌ మేకర్‌ను అవుతా. అవసరమైతే కింగ్‌ను అవుతా’ అని గద్దర్‌ ఒకసారి మీడియా ప్రతినిధులతోనే చెప్పారు. అక్టోబరులో భువనగిరిలో పది లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తానన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడతానన్నారు. కాని ఇప్పటివరకు పార్టీపై సమాచారం లేదు. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో కీలక నాయకుడిగా ఉన్న ఒకాయన ‘ఇంటిపార్టీ’ పేరుతో కొంతకాలం పార్టీ పెట్టాడు. దాని కార్యకలాపాలు ఏమిటో తెలియడంలేదు. సో…తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టే అవకాశం లేదనుకోవచ్చు.