కొనసాగడు… అయినా హాజరు..!

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఆ పార్టీ నాయకులను రకరకాలుగా ఆశ్చర్యపరుస్తున్నారు. కాంగ్రెసులో చేరతాడో, టీడీపీలోనే కొనసాగుతాడో చెప్పలేని విధంగా వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుసుకొని మాట్లాడిన తరువాత రాష్ట్రంలోని కాంగ్రెసు నాయకులతోనూ మంతనాలు జరుపుతున్నాడు. జంప్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇంతమందిని కలిసివాడు కాదు. తాను టీడీపీని వీడటంలేదని రేవంత్‌, ఆయన తమ పార్టీలో చేరడంలేదని కాంగ్రెసు నాయకులు నమ్మబలికారు. అసలు రేవంత్‌ను కాంగ్రెసులోకి తీసుకెళ్లడానికి కారకుడని చెప్పుకుంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి రేవంత్‌ రావడం 99శాతం ఖాయమన్నాడు. దీన్నిబట్టి కాంగ్రెసు నేతలు, రేవంత్‌ డ్రామా అడుతున్నారని చెప్పుకోవచ్చు.

తాను కొనసాగుతానని మరింత నమ్మకం కలిగించేందుకు ఈరోజు నిర్వహించిన టీడీపీ ముఖ్య సమావేశానికి రేవంత్‌ హాజరుకావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ నాయకుడైనా పార్టీ నుంచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్న తరువాత సమావేశానికి హాజరుకాడు. అసలు ఆహ్వానం అందదు. మరి రేవంత్‌కు ఆహ్వానం అందిందా? లేదా సమావేశం విషయం తెలిసి వెళ్లాడా? స్పష్టంగా తెలియలేదు. సమావేశం గురించి తెలుస్తున్న కొద్దిపాటి వివరాలనుబట్టి చూస్తే పార్టీలో కొనసాగుతానని చెప్పడానికి రేవంత్‌ వెళ్లలేదని అనుకోవచ్చు. తమ్ముళ్లను నిలదీయడానికి, ప్రశ్నించడానికి వెళ్ళినట్లు కనబడుతోంది.

నిజానికి ఈ సమావేశం రేవంత్‌ వ్యవహారంపై చర్చించడానికే ఏపీ మంత్రి కమ్‌ చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ఏర్పాటు చేయించారు. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారు. ఇంకా మూడో రోజులు ఉంటారట. కాని సమావేశానికి హాజరైనట్లుగా లేదు. ఇక ఈ సమావేశానికి రేవంత్‌ హాజరుకావడం చూసిన ఆయన వ్యతిరేకులు కంగుతిన్నారు. ఏపీ టీడీపీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని కాంట్రాక్టులు పొందుతున్నతీరుపై మండిపడినట్లు సమాచారం. ఈ వ్యవహారాలను ఇక్కడి నాయకులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారట.

తాను పార్టీ కోసం పోరాడుతూ జైలుకు కూడా వెళ్లానని, కాని వారు మాత్రం సీఎంతో అంటకాగుతూ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఆయన వ్యతిరేకులు కాంగ్రెసుతో అంటకాగడం మంచిది కాదని, ఆ పని ఎందుకు చేస్తున్నావని నిలదీశారట. ఇదిలావుండగా, రేవంత్‌ కాంగ్రెసులో తన వ్యతిరేకులను కలుసుకొని మంతనాలు జరుపుతున్నారు. తాను కాంగ్రెసులోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవడానికే వారిని కలుసుకొని మాట్లాడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రముఖ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణను కలుసుకున్నారు.

ఈమెకు-రేవంత్‌కు మధ్య బద్ధ వైరముంది. పరస్పరం ఘాటు విమర్శలు చేసుకునేవారు. అలాంటిది ఆమెను కలిసి మట్లాడాడు. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరుల్లో రాజగోపాల్‌ రెడ్డిని కలుసుకున్నారు. వెంకటరెడ్డిని త్వరలో కలుస్తారని సమాచారం. రేవంత్‌ చేరికను వ్యతిరేకిస్తున్న నాయకులు అనేకమంది కాంగ్రెసులో ఉన్నారు. అయినప్పటికీ అధిష్టానం సుముఖంగా ఉంది. చేరాక ఈయన పరిస్థితి, వ్యతిరేకించిన నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో….!