గంటాజీ… కాల్ సెంటర్లతో చావులు ఆగుతాయా?

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలతో అర్థంతరంగా తమ జీవితాలను కడతేర్చుకోవడం అనే దుర్ఘటనలు ఇటీవలి కాలంలో చాలా జరుగుతున్నాయి. అయితే ఒకదానిని మించి మరొకటి.. అనేక దుర్ఘటనలు ఇలాంటివి వెలుగు చూస్తున్నప్పటికీ.. చిన్నారుల ఇలాంటి ఆత్మహత్యలకు కారణాలు ఏమిటో సర్వత్రా అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ.. వాటిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతోంది.

ఇలాంటి ఆత్మహత్యలకు అసలు కారణాలు.. మార్కుల వేటలో కాలేజీ యాజమన్యాలు పెడుతున్న ఒత్తిడి అనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే.. ఆ దిశగా ఎలాంటి పరిష్కారానికి నిబంధనల్ని కట్టుదిట్టం చేయకుండా.. ప్రభుత్వం చాలా మొక్కుబడిగా స్పందిస్తోంది. వరుసపెట్టి ఇలాంటి దుర్ఘటనలు వెలుగుచూస్తున్న వేళ.. విద్యార్థుల సమస్యల కోసం ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం.. అనే మొక్కుబడి ప్రకటనతో మంత్రి గంటా శ్రీనివాసరావు చేతులు దులుపుకోవడం చాలా హేయం అని పలువురు భావిస్తున్నారు.

విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు , మరో మంత్రి నారాయణకు స్వయానా వియ్యంకుడు. విద్యార్థుల మరణాలకు దారితీస్తున్న వ్యవస్థీకృత ఒత్తిడి మరియు ఆందోళనల గురించి కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తే గనుక.. అది అంతిమంగా మంత్రి నారాయణ వద్దకే వచ్చి ఆగుతుందనే సంగతి కూడా గుర్తంచుకోవాలి. నారాయణ గ్రూపునకు చెందిన కాలేజీల విషయంలో ఆంక్షలు ఏమీ ఉండవు. ఉన్నా ఉల్లంఘిస్తే అడిగే దిక్కుండదు. అంతా అయినవారే గనుక.. యథేచ్ఛగా వారి విశృంఖలత సాగిపోతూ ఉంటుందనే విమర్శలూ చాలానే ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కనీసం పిల్లల మరణాలు శృతిమించుతున్నప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా స్పందించకపోతే ఎలా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం.. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే.. కాలేజీలో లెక్చరర్లు పెట్టే యాతన భరించలేక ఆత్మహత్య చేసుకోదలచుకున్న కుర్రాడు ఆ కాల్ సెంటర్ కి ఫోన్ చేసి తన సమస్య చెప్పుకోవడం అసాధ్యం అనే వాదన వినిపిస్తోంది. ప్రెవేటు జూనియర్ కాలేజీలు.. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లకు కోట్ల లాభాలను ఆర్జిస్తున్నాయి.

మరి విద్యార్థుల జీవితాలను కాపాడడానికి వ్యవస్థీకృతంగా కొన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిబంధనలు విధించాలని.. మొక్కుబడి కాల్ సెంటర్ కాకుండా, ప్రతి కాల్ సెంటర్ కాలేజీ యాజమాన్యంతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వం తరఫున కౌన్సెలర్లు ఉండేలా చూడాలని, వారి తాలూకు వేతన ఖర్చులు మాత్రం కాలేజీ యాజమాన్యాలే ప్రభుత్వానికి చెల్లించే ఏర్పాటు ఉంటే.. కాస్త ప్రయోజనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. పిల్లలను చదువుతో సంబంధం లేకుండా, రోజూ వారితో మాట్లాడే.. ఊరడించే ఒక వ్యక్తి అయినా ఉంటేనే.. ఇలాంటి అర్థంతర మరణాలకు దారితీసే భావోద్వేగాల సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందని పలువురు పేర్కొంటున్నారు.