గంటా విదేశీ టూర్ పై బాబు గుర్రు!

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం అమెరికా యాత్రలో ఉన్నారు. ఇదేమీ ఒంటరిగా వెళ్లిన వ్యక్తిగత పర్యటన కాదు. తాను పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ నుంచి అధికారుల బృందాన్నంతటినీ ఆయన వెంటబెట్టుకుని మరీ అమెరికా వెళ్లారు. ఇంకా తిరిగి రాలేదు. ఇక్కడ రాష్ట్రంలో విద్యావ్యవస్థ, శాఖ పనితీరు మొత్తం మంటగలిసిపోతున్న సమయంలో.. ఈ విదేశీ టూర్లు ఏమిటంటూ… చంద్రబాబునాయుడు ఆగ్రహానికి కూడా కారణమైంది.

తన విదేశీ పర్యటన నుంచి తిరిగి అమరావతికి చేరగానే.. అన్నిశాఖలకు చెందిన అధికార్లతో పెట్టుకున్న సమీక్ష సమావేశంలో విద్యాశాఖ కనిపించకపోయేసరికి చంద్రబాబునాయుడుకు ఆగ్రహం కట్టలు తెంచుకుందిట! విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు.. గంటా మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కొన్ని మంత్రిత్వ శాఖల పనితీరు చాలా ఘోరంగా ఉన్నదనే వాదనలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిలో ప్రజలకు అత్యవసరమైన విద్య, వైద్యం రెండు రంగాలూ ఉండడం ఒక దౌర్భాగ్యం. ఈ రెండు శాఖల మీద చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు ఎంత అసంతృప్తి వ్యక్తం చేసారో లెక్క తేలే సంగతి కాదు.

అలాంటిది… ఇప్పుడు విద్యాశాఖ పనితీరు కొన్నాళ్లుగా చాలా వివాదాల్లో ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలు శృతి మించిపోయి.. రాష్ట్రం మొత్తం గందరగోళంగా ఉన్న సమయంలో.. ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ యాత్రకు వెళ్లడమే చంద్రబాబునాయుడుకు ఆగ్రహం తెప్పించినట్లుగా ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలకు గంటా విద్యాశాఖ చూస్తుండడం ఒక కారణం అని అనేక రకాల విమర్శలు వచ్చాయి.

గంటాను ఆ శాఖనుంచి తప్పిస్తే తప్ప విద్యార్థుల ఆత్మహత్యలు ఆగవంటూ అనేక మంది దెప్పిపొడిచారు. ఇకవైపు రాష్ట్రంలో తన శాఖ పరిస్థితులు ఇంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. గంటా విదేశాలకు వెళ్లడం సహజంగానే చంద్రబాబుకు కోపం తెప్పించింది. దీన్ని దాచుకోకుండా శుక్రవారం నాటి అధికార్ల సమీక్ష సమావేశంలో ఆయన వెళ్లగక్కినట్లు విశ్వసనీయ సమాచారం. మరి గంటా విదేశాల నుంచి తిరిగి రాగానే.. ఈ ఆగ్రహప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాలి.