గడ్కరీని ఒప్పిస్తే చంద్రబాబు సమర్థతే!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యనిర్వహణా సామర్థ్యానికి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురవుతోంది. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు ఏమిటో.. స్పష్టంగా తేలిపోయాయి. కాంట్రాక్టరును మార్చేయడానికి చంద్రబాబు రెడీ అన్నంత మాత్రాన… ఆరూపేణా అంచనా వ్యయంలో భారం పెరిగితే… దానిని భరించడానికి కేంద్రం సిద్ధంగాలేదు.

ఆ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు సర్కారుకు ఒక రకంగా వణుకు పుట్టిందని చెప్పాలి. అసలే పదిరోజుల విదేశీ పర్యటనను ప్లాన్ చేసుకున్న చంద్రబాబునాయుడు గడ్కరీ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తక్షణం ఆయనతో భేటీ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన నాగపూర్ లో ఉంటే ముందు తాను అక్కడకు వెళ్లి, పోలవరం నిర్మాణంలో ఉన్న సాధకబాధకాలను ఆయనకు నివేదించి, కాంట్రాక్టరును మార్చడానికి ఒప్పించి నాగపూర్ నుంచే అమెరికా పర్యటనకు వెళ్లేలా తన షెడ్యూలును అర్జంటుగా మార్చుకున్నారు.

పోలవరం బడ్జెట్ విషయంలో చంద్రబాబు నిర్ణయం వల్ల 30శాతం అదనంగా పడే భారాన్ని కేంద్రం మోయడానికి ఒప్పించగలిగితే.. చంద్రబాబు సమర్థత కిందే లెక్క. అలా కాకుండా.. మీనమేషాలు లెక్కిస్తూ.. ఆ భారాన్ని రాష్ట్ర ఖజానా మీద వేశారంటే మాత్రం చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలను దారుణంగా వంచిస్తున్నట్లు లెక్క!

ఇలాంటి సంక్లిష్ట నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబునాయుడు నాగపూర్ పర్యటన సాగనుంది. నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా సునాయాసంగా మాట మార్చేశారు. ఇది నా ప్రాజెక్టు అన్నట్లుగా దీనికి నిధులుమంజూరు చేసి 2019 ఎన్నికల్లోగా అనుకున్నంత వరకు పూర్తయ్యేందుకు సహకరిస్తానని మొన్నటికి మొన్న పనులను పర్యవేక్షించినప్పుడు సెలవిచ్చిన గడ్కరీ, నిన్న ఢిల్లీలో మీడియాకు ఇచ్చిన విందులో మడత పేచీ పెట్టారు. రాష్ట్రప్రభుత్వం తిరిగి టెండర్లు పిలవాలని కోరుతున్నదని ఈ ప్రతిపాదనకు కేంద్రం ఒప్పుకోవడం లేదని చెప్పారు. కాంట్రాక్టరును మారిస్తే 30శాతం అదనపు భారం పడుతుందని దాన్ని కేంద్రం భరించలేదని ఆయన తేల్చేశారు. ఇది రాష్ట్రానికి అశనిపాతం లెక్క.

పాత కాంట్రాక్టరు పనులు చేయడు. నత్తనడక కంటె ఘోరంగా పనులు సాగుతుంటాయి. కాంట్రాక్టరుకంటె ముందుగా అతని మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లమాలిన జాలి కురిపించేస్తుంటారు. అతను పనులు చేయలేడు, అతని వద్ద డబ్బుల్లేవు, కాంట్రాక్టరును మార్చేద్దాం వంటి డైలాగులు వేస్తుంటారు. కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులో పెట్టడం, అదే కాంట్రాక్టరుకు సంబంధం ఉన్న రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల పనులు అన్నింటినుంచి తప్పించడం లాంటి కఠిన చర్యల జోలికి వెళ్లరు.

కాంట్రాక్టరు కంటె ముందు చంద్రబాబునాయుడే.. ఇప్పుడు ధరలుపెరిగిపోయాయి.. పాత రేట్లకు చేయలేరు అని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. ఈ నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలవడం అనేది ప్రహసనంగా మారుతోంది. పనులు జరగాలంటే,.. కొత్త టెండర్లు పిలవడమే మార్గం అనే పరిస్థితిని రాష్ట్రప్రభుత్వమే సృష్టించింది.

కానీ ఆ భారం సంగతేమిటి. దాన్ని కేంద్రం మీద మోపాలనేది చంద్రబాబు ఐడియా. అందుకు ససేమిరా అని కేంద్రం అంటోంది. కానీ చంద్రబాబు తన తెలివితేటలు, లౌక్యం చతురత ఉపయోగించి గడ్కరీని ఆ భారం అదనంగా మోయడానికి ఒప్పిస్తే మాత్రం ఆయన సమర్థత కిందే చెప్పుకోవాలి. ఒక రకంగా … ఆయన అసమర్థత పుణ్యమాని పెరిగిన అంచనా వ్యయాన్ని, ఆయన సమర్థత కేంద్రం మీదకు నెట్టేస్తున్నదని అనుకోవాలి. ఈ విషయంలో నాగపూర్ భేటీలో చంద్రబాబు సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.