గడ్డ కట్టే చలిలో ‘సూర్య’ సాహాసాలు

కొన్నిసార్లు సహజత్వం కోసం కాస్త కష్టపడాల్సిందే. సెట్ వేసి పనికానిచ్చేస్తామంటే వర్కవుట్ కాదు. నా పేరు సూర్య సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలే కొన్ని ఉన్నాయి. ఇండో-పాక్ బోర్డర్ లో తీయాల్సిన ఎపిసోడ్ ఇది. ఇలాంటి సన్నివేశాల్ని సెట్ వేసి తీస్తే అంత సహజంగా రావు.

అందుకే బన్నీతో పాటు యూనిట్ అంతా బోర్డర్ కు వెళ్లింది. గడ్డకట్టించే చలిలో సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం భారత్-పాక్ సరిహద్దులో మైనస్ 12డిగ్రీల సెల్సియస్ లో నా పేరు సూర్య సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తున్నట్టు ప్రకటించింది యూనిట్.

వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా ఈ సన్నివేశాల్ని బోర్డర్ లోనే తీయాలని బన్నీ ఫిక్స్ అయ్యాడట. అందుకే ఎముకలు కొలికే చలిని సైతం లెక్కచేయకుండా ఈ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారట. సినిమాలో ఈ సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయని అంటోంది యూనిట్.

నా పేరు సూర్య సినిమాకు సంబంధించి సెకెండ్ సింగిల్ ను వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 27న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.