చందమామ రీఎంట్రీ మామూలుగా లేదుగా..!

కాజల్ అగర్వాల్.. ఈ పేరు తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. లక్ష్మీ కల్యాణం సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి ఈ క్యూట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం అభినయంతో వేలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. మూడేళ్ల క్రితం గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకోగా.. ఇటీవలే పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అదిరిపోయే టాప్ సినిమాలతో రీఎంట్రీ ఇస్తోంది. ఒకేసారి నాలుగైదు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పేసింది ముద్దుగుమ్మ.

స్టార్ హీరో కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందీ క్యూట్ బ్యూటీ. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తుండగా.. ఇందులో చాలా మంది అగ్ర నటులు నటిస్తున్నారు.

పాని ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఎన్బీకే 108లో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు డబల్ రోల్స్ లో కనిపిస్తుండగా.. బాలకృష్ణ సరసన కాజల్ తో పాటు శ్రీలీల కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.

అయితే ఇది బాలకృష్ణ 108వ చిత్రం కావడంతో.. దీనికి ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ అంజలి కూడా కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది.

తమిళ డైరెక్టర్ కల్యాణ్ దర్శకత్వంలో వస్తున్న గోస్టీ అనే చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ యే కాకుండా రాధికా శరత్ కుమార్ యోగి బాబు కేఎస్ రవికుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండగా… ఈనెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. అలాగే హిందీలో రాబోతున్న ఉమ అనే చిత్రంలో కూడా కాజల్ మెరవబోతోంది. అయితే పెళ్లి తర్వాత కాజల్ చేస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం ఇదే.