చంద్రబాబుకీ ‘వర్మ పంచ్‌’ పడిందిగా.!

ఎవర్నీ వదలడంలేదు రామ్‌గోపాల్‌ వర్మ.. ఒక్క వైఎస్సార్సీపీ నేతల్ని తప్ప. టీడీపీ నేతల నుంచి వచ్చే ప్రతి కామెంట్‌కీ వర్మ సోషల్‌ మీడియా నుంచి కౌంటర్‌ ఇస్తూనే వున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకీ వర్మ ‘పంచ్‌’ ఇచ్చారు. ‘చరిత్రని వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు..’ అంటూ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విషయమై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వర్మ, ‘చంద్రబాబు చెప్పింది నిజం. చరిత్రను వక్రికీరించడంలేదు..’ అంటూనే, ‘చిరిగిపోయిన, చించివేయబడ్డ పేజీలను అతికిస్తున్నా..’ అని క్లారిటీ ఇచ్చేశాడు.

ఆ చించివేయబడ్డ పేజీలను ‘వెన్నుపోటు, ఎన్టీఆర్‌పై చెప్పులేయించడం..’ వంటి విషయాలుగా జనం అర్థం చేసుకోవాలేమో. ఎందుకంటే, వెన్నుపోటుకి అధికార మార్పిడి అనే ఘనమైన పేరు పెట్టి, చరిత్రను వక్రీకరించింది ఇంకెవరో కాదు, చంద్రబాబే. పిల్లనిచ్చిన మామ, రాజకీయంగా గుర్తింపునిచ్చిన మామ ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన ఘన చరిత్ర కూడా చంద్రబాబుదే మరి.!

‘చరిత్రను వక్రీకరించకుండా వున్నది వున్నట్లుగానే తీస్తున్నా..’ అంటూ వర్మ, చంద్రబాబుకి ఇచ్చిన ‘పవర్‌ పంచ్‌’పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారోగానీ, వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తీసేలోపు, ఇలాగే బోల్డంత కంటెంట్‌ దొరికేలా వుంది. కౌంటర్లు సరే, సినిమా సంగతేంటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. ఎందుకంటే, అది వర్మ సినిమా.