చంద్రబాబుపై రేవంత్‌ నోరు మెదపరేం.?

రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడమెంత సహజమో, పార్టీ మారే సమయంలో.. ఆయా పార్టీలపై దుమ్మెత్తి పోయడమూ అంతే సహజం. ‘ఆ పార్టీ పరమ చెత్త.. ఆ చెత్తలో వుండలేకే, పార్టీకి రాజీనామా చేస్తున్నా..’ అని చెప్పని నాయకుడు బహుశా రాజకీయాల్లో కనిపించడేమో.! కానీ, రేవంత్‌రెడ్డి అందుకు పూర్తి భిన్నం. ‘చంద్రబాబు నాకు టీడీపీలో ఇచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. టీడీపీని వీడటం గుండె కోతతో సమానం..’ అంటూ రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

రేవంత్‌ ఇంత గొప్పగా టీడీపీ గురించి చెప్పినా, టీడీపీ నేతలు ఊరుకోలేదు. ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్‌పై దుమ్మెత్తిపోసేశారు. అయినా, రేవంత్‌ మాత్రం కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ నేతలతో మమేకమయిపోతున్నారాయన. చిత్రంగా ఇటీవలి కాలంలో తెలంగాణకు సంబంధించినంతవరకు కాంగ్రెస్‌ నుంచి టీడీపీ వైపు విమర్శలు పెద్దగా కన్పించడంలేదు.

ఓటుకు నోటు కేసు విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, రేవంత్‌పై టీడీపీ నేతలు మండిపడ్తున్నారు. ‘ఆ వ్యవహారమే టీడీపీని తెలంగాణలో ఇబ్బందులపాల్జేసింది.. అది రేవంత్‌ తొందరపాటు మాత్రమే..’ అన్నది టీడీపీ నేతల వాదన. మామూలుగా అయితే, ఈ పాయింట్‌ని పట్టుకుని, చంద్రబాబుని రేవంత్‌రెడ్డి కడిగిపారెయ్యాలి. అయినా, రేవంత్‌ ‘సంయమనం’ పాటిస్తుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

చంద్రబాబు బ్రీఫింగ్‌ చేయడంతోనే, రేవంత్‌రెడ్డి దూకుడు ప్రదర్శించారు.. ఆ దూకుడే ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించేసింది. ఇక్కడ సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి మాత్రమే రేవంత్‌రెడ్డి. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. అయినా, ఆ కేసు అలా అలా ‘సైలెంట్‌ మోడ్‌’లోకి వెళ్ళిపోయిందనుకోండి.. అది వేరే విషయం.

మొత్తమ్మీద, రేవంత్‌రెడ్డి ఓ ‘పద్ధతి’ ప్రకారం రాజకీయ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి స్క్రీన్‌ప్లే రచించింది కూడా చంద్రబాబేనా.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. చంద్రబాబుపై రేవంత్‌ నోరు మెదకపోవడంతోనే ఈ అనుమానాలు రోజురోజుకీ మరింత బలపడ్తున్నాయి.