చిరు, నాగ్‌ల‌కు ప్ర‌ధాని నుంచి ప్ర‌శంస‌లు

క‌రోనాపై త‌మ సృజ‌నాత్మ‌క‌త‌తో తెలుగు స‌మాజాన్ని చైత‌న్యప‌రుస్తున్న ప్ర‌ముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున‌తో పాటు వ‌ర్త‌మాన హీరోలు వ‌రుణ్‌తేజ్‌, సాయితేజ్‌ల‌ను ప్ర‌ధాని మోడీ ప్ర‌శంసించారు. సామాజిక అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో చిరంజీవి, నాగార్జున ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు.

ప్ర‌స్తుతం దేశాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాను పార‌దోలేందుకు ప్ర‌ధాని మోడీ 21 రోజుల లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంలో ఇళ్ల‌లోనే ఉంటూ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చిరు, నాగ్‌తో పాటు వ‌రుణ్‌తేజ్‌, సాయితేజ్ క‌ల‌సి సంగీత ద‌ర్శ‌కుడు కోటి సార‌థ్యంలో రూపొందించిన ఓ ప్ర‌త్యేక సాంగ్‌లో న‌టించారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి సామాజిక దూరం పాటించాల‌ని ఆ పాట ద్వారా కోరారు. అలాగే ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.

ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు. అర్థ‌వంత‌మైన సాహిత్యానికి ర‌మ‌ణీయ‌మైన సంగీతం తోడు కావ‌డంతో…ఆ పాట బాగా వైర‌ల్ అయింది. ఈ పాట ప్ర‌ధాని దృష్టికి వెళ్లింది. ఇన్‌స్ఫైర్ చేసిన ఆ పాట గురించి మోడీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ…ఆ పాట‌లో న‌టించిన చిరంజీవి, నాగార్జున, వ‌రుణ్‌తేజ్‌, సాయితేజ్‌ల‌ను అభినందిస్తూ తెలుగులో ఆయ‌న ట్వీట్ చేశారు.

‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’ అని ప్ర‌ధాని పిలుపు నిచ్చారు. ఇది తెలుగు ప్ర‌జ‌ల‌కు అందిన అభినంద‌న‌గా అంద‌రూ భావిస్తున్నారు.