చెప్పుకోడానికే సీక్వెల్.. అంతా ఉత్తిదే

సౌత్ కు సీక్వెల్స్ పెద్దగా అచ్చిరాలేదు. అలాంటప్పుడు గత సినిమా విజయాన్ని క్యాష్ చేసుకోవడం కుదరదు కదా. అందుకే మేకర్స్ ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారు. టైటిల్ లో మాత్రమే సీక్వెల్ చూపిస్తున్నారు. కంటెంట్ లో మాత్రం ఆ ఛాయలే కనబడకుండా చేస్తున్నారు. అదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.

ఉదాహరణకు రాజుగారి గది-2 సినిమానే చూసుకుందాం. గతంలో రాజుగారి గది హిట్ అయింది కాబట్టి.. ఆ టైటిల్ ను దీనికి వాడుకున్నారంతే. ఆ సినిమాకు, రిలీజ్ కు రెడీ అయిన రాజుగారి గది-2కు ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు.. భవిష్యత్తులో రాజుగారి గది-3, రాజుగారి గది-4 కూడా తీస్తానంటున్నాడు ఓంకార్. అంటే టైటిల్ కొనసాగుతుంది కానీ కథ కాదన్నమాట.

ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్న భారతీయుడు-2ది కూడా ఇదే పరిస్థితి. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇది రాబోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ కూడా టైటిల్ మాత్రమే రిపీట్ చేస్తున్నారు. కథ పూర్తిగా కొత్తదే. భారతీయుడు సినిమా క్లయిమాక్స్ లో విదేశాలకు వెళ్లి తప్పించుకుంటుంది సేనాపతి అనే క్యారెక్టర్. పార్ట్-2 అక్కడ్నుంచి మొదలవుతుందని అంతా భావించారు. కానీ అలాంటిదేం ఉండదని, ఓ కొత్త కథతో వస్తున్నామని శంకర్ నిన్న క్లారిటీ ఇచ్చేశాడు.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 2.0 సినిమాను కూడా సీక్వెల్ అనుకున్నారంతా. అయితే ఇది కూడా సీక్వెల్ కాదనే విషయాన్ని శంకర్ స్పష్టంచేశాడు. కేవలం రోబోలో ఉన్న పాత్రలు, వాటి గెటప్పుల్ని మాత్రమే 2.0లో తీసుకున్నామని, మిగతా కథంతా కొత్తగానే ఉంటుందని.. గత సినిమా పాత్రలు, సన్నివేశాలకు కొనసాగింపుగా ఏమీ ఉండవని తేల్చేశాడు.

కిక్-2, సర్దార్ గబ్బర్ సింగ్-2 సినిమాల్లో కూడా దాదాపు ఇదే జరిగింది. పేర్లు, గెటప్పులు మాత్రమే కొనసాగించారు. కథ, సన్నివేశాలు, సందర్భాలు పూర్తిగా మారిపోయాయి. మొత్తమ్మీద సౌత్ మేకర్స్ సీక్వెల్ కు ఓ కొత్త మీనింగ్ కనిపెట్టారు.