ఛాంబర్ల కోసం సిగపట్ల కుస్తీలు!

తామేదో అద్భుతమైన ప్లానింగ్ అత్యాధునిక సదుపాయాలతో.. అన్ని రకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ కొత్త భవనాలకు రూపకల్పన చేసేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే టముకు వేసుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంలో జరుగుతున్నది మాత్రం వేరు.

వెలగపూడిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ ప్రాంగణంలో తమ హోదాకు తగినట్లుగా ఛాంబర్లు లేవంటూ.. నాయకులు కుస్తీలు పట్టే ప్రమాదం వచ్చి పడుతోంది. చాలినన్ని గదులు లేక, ఉన్న గదులను హోదాల వారీగా అందరికీ అడ్జస్ట్ చేయలేక… ఉన్నవాటిలో హోదాకు తగిన రిచ్ నెస్ తో ఉండేవి ముందే కొన్ని కబ్జాలకు గురికాగా.. మొత్తానికి గదులకోసం, చాంబర్లకోసం నానా కీచులాటలు జరుగుతున్నాయి.

వెలగపూడి అసెంబ్లీ.. మొన్న మొన్నటి వరకు ఒక రకంగా ప్రశాంతంగానే ఉన్నదని చెప్పాలి. తాజాగా తెలుగుదేశం అధినేత.. తమ పార్టీ వారిలో ఇద్దరికి రెండు కేబినెట్ ర్యాంకు పదవులను కట్టబెట్టారు. అనంతపురం జిల్లాకే చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని శాసనసభలోను, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ను శాసన మండలిలోనూ చీఫ్ విప్ లుగా ముఖ్యమంత్రి ప్రకటించేశారు. దీంతో వీరిద్దరికీ కేబినెట్ హోదా వచ్చేసింది. తమ కేబినెట్ హోదాను వెలగబెట్టేలా ఛాంబర్లు కావాలని చూసుకునే సరికి అసెంబ్లీలో వారికి అంత వెసులుబాటు మాత్రం లేదు.

తెలుగుదేశం పార్టీ కొత్తగా ఇద్దరు నాయకులకు చీఫ్ విప్ హోదాను కట్టబెట్టింది. మంత్రి పదవి రాలేదని… సామాజిక వర్గ సమీకరణల్లో తనకు అన్యాయం జరిగిందని కినుకగా ఉన్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కు మండలిలోను, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డికి శాసనసభలోను చీఫ్ విప్ హోదాలను ఇచ్చారు. దాంతో వారికి కేబినెట్ హోదా దక్కింది. ఈ ఇద్దరూ ఇప్పుడు వెలగపూడి శాసనసభ ప్రాంగణంలో తమ హోదాకు తగ్గట్లుగా ఎక్కడా కూర్చోవాలో తెలియక గదులు వెతుక్కుంటున్నారు.

తమ హోదాకు తగ్గ ఛాంబర్ లు ఖాళీ లేవనేది వారి బాధగా ఉంది. అయితే పయ్యావుల్ కేశవ్ మాత్రం.. శాసనసభకున్న ఇన్ ఛార్జి సెక్రటరీ సత్యనారాయణ ప్రస్తుతం ఉంటున్న ఛాంబర్ మీద కన్నేశారు. సత్యనారాయణ హోదాకంటె మించిపోయిన ఛాంబర్ ను నియమాలకు విరుద్ధంగా అనుభవిస్తున్నారని కూడా తెలుసుకున్నారు. దానికోసం ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ గదికోసం సదరు అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి.. పయ్యావుల ఈ గదిలోకి వచ్చేస్తే తన పరువు పోతుందని.. తనను ఆ గదినుంచి ఖాళీ చేయించకుండా దయపెట్టాలని ముందస్తుగానే స్పీకరు దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

మరి పార్టీవారికి హోదాలకు తగ్గ గదులు లేకుండా… అధికార్లకు హోదాకు మించిన గదులేంటి? అనే చర్చ నేతల్లో నడుస్తోంది. ఈ పితలాటకంలో పయ్యావుల గెలుస్తాడో.. అసెంబ్లీ ఇన్ ఛార్జి కార్యదర్శి నెగ్గుతాడో చూడాలి.