జగన్‌ సంకల్పం.. చంద్రబాబు అసహనం.!

ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేందుకు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాల అనుమతి తీసుకోవాలా.? తీసుకోవాలనుకున్నా, ప్రభుత్వాలు అందుకు అనుమతిస్తాయా.? తమను విపక్షాలు ప్రశ్నిస్తునప్పుడు, ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఆ పార్టీ వైపు ఆందోళనలకు అనుమతిచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థని అంతలా అధికార పార్టీలు దిగజార్చేశాయి మరి.!

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఆ ఎన్నికల హామీని నిలబెట్టుకోమని ముద్రగడ పద్మనాభం ప్రశ్నిస్తూ, రోడ్డెక్కుతోంటే అడ్డుకుంటున్నారు. పైగా, పాదయాత్రకు అనుమతి కోరాలంటూ ప్రభుత్వం తరఫునుంచి ఉచిత సలహాలు వస్తున్నాయి. జనంలోకి ఓ నాయకుడు వెళ్ళాంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలన్నది ఏ నైతిక విలువలకు నిదర్శనమట.?

ముద్రగడ వ్యవహారం అలా వుంచితే, జగన్‌ పాదయాత్రకీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.. అన్నమాట, సాక్షాత్తూ డీజీపీ నోట వచ్చింది. దాంతో, అంతా అవాక్కయ్యారు. ‘అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు..’ అంటూ ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పోలీస్‌ బాస్‌గా డీజీపీ, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిందే. ఆ బాధ్యత ఆయన మీదనే వుంది. అదే సమయంలో, రాజకీయ పార్టీలన్నాక వాటికీ కొన్ని కార్యాచరణలు వుంటాయి. ఆ విషయం డీజీపీ మర్చిపోతే ఎలా.!

ముద్రగడ వ్యవహారానికీ, జగన్‌ పాదయాత్రకీ ఒకటే మంత్రమంటే ఎలా కుదురుతుంది.? గతంలో చంద్రబాబు పాదయాత్ర చేశారు.. అంతకు ముందు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేశారు.. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోనే విపక్షాలూ అనేక రాజకీయ కార్యక్రమాలు చేపట్టాయి. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల కోసం ‘అనుమతి’ తీసుకోవడం అన్నది ఆయా రాజకీయ పార్టీల వ్యూహాల్ని బట్టి వుంటుంది. అది వేరే విషయం.

చంద్రబాబు అసహనమే డీజీపీ నోట ‘హెచ్చరిక లాంటి సూచన’గా వచ్చిందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చల సారాంశం. ‘జగన్‌ ఎలా పాదయాత్ర చేస్తారు.? అసలంటూ కోర్టు అనుమతిస్తేనే కదా.?’ అంటూ కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే, వ్యాఖ్యానించిన ఘనులు చంద్రబాబు అండ్‌ టీమ్‌. అదొక్కటి చాలు, జగన్‌ పాదయాత్ర అంటే చంద్రబాబు సర్కార్‌ ఎంతగా భయపడ్తోందో చెప్పడానికి.

ఇప్పుడీ అనుమతుల పేరుతో డీజీపీ ద్వారా చంద్రబాబు వైఎస్సార్సీపీకి హెచ్చరిక పంపాలనుకున్నారుగానీ, అది కాస్తా తుస్సుమంది. పైగా, చంద్రబాబు ‘భయం’ మరోమారు బట్టబయలయిపోయింది.