జగన్.. కాస్త తగ్గితే తప్పేం లేదు!

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం.. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు వితరణ చేయదలచుకుంది. వారికి స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ.. అయిదేళ్ల తర్వాత వారు ఆ భూములను అమ్ముకోవడం కూడా సాధ్యం అయ్యేలా.. రూపొందించిన పత్రాలతో.. వారికి స్థలాలు ఇవ్వాలని సంకల్పించారు. ఉగాది నాడు రాష్ట్రంలోని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వం సంకల్పం. అయితే.. సరిగ్గా ఉగాది పండుగకు ఒక్కరోజు ముందు.. ఈ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. సీఆర్డీయే భూముల్లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించేలా వచ్చిన జీవోను కూడా ఏకంగా సస్పెండ్ చేసింది.

ఈ ఉత్తర్వుల విషయంలో జగన్మోహన రెడ్డి సర్కారు ఒకింత వెనక్కు తగ్గితేనే పరిపాలన పరంగా ప్రభుత్వానికి మేలు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. అయితే.. ఆ స్థలాల్లో వాళ్లు ఇళ్లు కట్టుకుని నివసించాలని, ఆ రకంగా రాష్ట్రంలో సొంత ఇల్లు అంటూ లేని పేదవాడు ఉండకూదని ప్రభుత్వం కోరుకోవాలి. ఇదివరకు పేదలకు ఇంటిస్థలాల పట్టాలు ఇచ్చినా కూడా ఇలాంటి నిబంధనలతోనే ఇచ్చేవారు. నిర్దిష్ట సమయం గడువుగా విధించి.. ఆలోగా ఇల్లు నిర్మించుకునేట్లయితే మాత్రమే ఆ పట్టా చెల్లుతుందని, నిర్మించుకోకపోతే స్థలం తిరిగి ప్రభుత్వ పరం అవుతుందనే నిబంధన ఉండేది. తద్వారా.. పేదలు చిన్నవో పెద్దవో ఇళ్లు నిర్మించుకునేవారు. ఆ స్థలాల్లో ఇళ్ల విక్రయాలు చెల్లవనే నిబంధన ఉండడంతో.. అనధికారిక విక్రయాలు జరిగినా చాలా పరిమితంగా ఉండేవి.

ఇప్పుడు జగన్ ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులతో స్థలాలు ఇవ్వడం వల్ల.. చాలా అపసవ్యతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. స్థలాలు తీసుకునేవాళ్లు.. అయిదేళ్ల పాటూ ఇల్లే కట్టుకోకుండా ఊరుకుండిపోయి.. తర్వాత వాటిని విక్రయించేసుకున్నా అడిగే దిక్కులేదు. ఆ తర్వాత.. మళ్లీ తమకు ఇంటిస్థలాలు కావాలంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించే అవకాశమూ ఉంటుంది. అంటే ప్రభుత్వంలో పైరవీలు చేసుకోగలిగిన పేదలు.. ఈ ప్రభుత్వ సంకల్పాన్ని దుర్వినియోగం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఇంచుమించు ఇలాంటి సందేహాలతోనే ఈ జీవోపై కోర్టు స్టే విధించింది.

జగన్ సర్కారు పట్టుపడితే.. సమస్య అంత సులువుగా తెగకపోవచ్చు. నిజంగా నివాసం కోసం ఇంటిస్థలం కోరుకునే పేదలు.. విక్రయించుకునే హక్కులు ఇవ్వకపోయినా సరే, సంతోషంగా స్థలం తీసుకుంటారు. అలాంటి పరిస్థితి గుర్తుంచుకుని.. ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు తగ్గి.. జీవోలో మార్పనులు చేస్తే సత్వరం అందరికీ ఇంటిస్థలాలు ఇవ్వడం కుదురుతుంది. అనవసరంగా పంతాలకు పోవడం వల్ల.. సుప్రీం కోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది.. అక్కడకూడా ఎదురుదెబ్బ తగిలితే మరింత జాప్యం తప్పదు. అనవసరమైన అపకీర్తి వస్తుంది. ఈ విషయాల్ని జగన్ సర్కారు దృష్టిలో ఉంచుకోవాలి.