జగన్ ఫేక్ సీఎం.. చాలామందిని చూశా.. బీకేర్ ఫుల్: జగన్ పై చంద్రబాబు ఫైర్

‘వరదలతో రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్రికి ఏం పట్టనుంది. జరిగిన పంట నష్టానికి ఎంత పరిహారం ఇస్తారో చెప్పకుండా సభను పక్కదారి పట్టిస్తున్నారు. జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి. వరదలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతు సమస్యలపై..

‘ఏడాదిన్నర కాలంలో ఏడుసార్లు వరదలు వచ్చాయి. రైతులంటే ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకో అర్థం కావడంలేదు. సభలోని సభ్యులను కించపర్చేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. వరద సాయం విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ అన్నీ గాలి కబుర్లే. ప్రభుత్వానివి మోసపూరిత ప్రకటనలు. రైతుల విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2019-20 సంబంధించి 1300 కోట్ల క్లెయిమ్ కట్టుంటే రైతులకు 3 నుంచి 4 వేలు ఇన్సూరెన్స్ వచ్చేది. రైతుల సమస్యలపై ప్రభుత్వం నుంచి నిర్దిష్ట హామీ వచ్చేంత వరకు అసెంబ్లీలో పోరాడతాం. హెక్టారు వరికి 30వేలు, ఉద్యాన పంటలకు 50 వేలు, కుల వృత్తులకు 15వేలు, ప్రతి కుటుంబానికి 10 వేలు ఇవ్వాలి

సీఎం కూడా ఆలస్యంగా వస్తారా..

సభకు సీఎం ఆలస్యంగా రావడం ఎప్పుడూ చూడలేదు. చట్టసభలు సమయం ప్రకారం ప్రారంభం కావాలి. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా సభలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో జగన్ ఆటలాడుకుంటున్నారు. ఏడాదిలో లక్షా 25 వేల కోట్లు అప్పులు చేశారు. ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతారు.. గాలి కబుర్లు చెప్తారు. వరదలపై ఒక సమీక్ష కూడా చేయడం లేదు. అసెంబ్లీ నియమాలకు విరుద్ధంగా ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా మమ్మల్ని వెకిలి చేస్తున్నారు. బీ కేర్ ఫుల్.. చాలా మందిని చూశా..!

వెల్ లోకి ఎప్పుడూ వెళ్లలేదు..

ఎమ్మెల్యే రామానాయుడును ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడ్డం కరెక్టేనా? నా లైఫ్‌లో నేనెప్పుడూ వెల్‌లోకి వెళ్లలేదు. పరిటాల రవి హత్య సందర్భంలో కూడా నేను వెల్‌లోకి వెళ్లలేదు రైతుల విషయంలో సీఎం తీరు నచ్చకే పోడియం ముందు బైఠాయించాను. గాలికొచ్చారు.. గాలికే పోతారు. వైఎస్ కు ప్రజలంటే భయం ఉండేది. జగన్ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదు. ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తారా?

అమరావతి చేసిన పాపం ఏంటి?

అమరావతి చేసుకున్న పాపం ఏంటి? హైటెక్ సిటీని బిల్ గేట్స్ అభినందించారు. ఉన్మాద చేష్టలకు ఇంకా అంతు లేదా? జీనోమ్ వ్యాలీకి ప్రధాని వస్తే ఎంతో సంతోషించా. నాకోసం అభివృద్ధి చేయలేదు, ప్రజలకోసమే చేశా. అమరావతిని నాశనం చేస్తూ డ్రామాలాడుతున్నారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

ప్రజలంటే జగన్ కు భయం లేదు..

గతంలో వైఎస్సార్ ఇదే విధంగా మాట్లాడితే.. మైండ్ యువర్ టంగ్ అంటూ హెచ్చరించా. వైఎస్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. వైఎస్ కు ప్రజలంటే భయం ఉండేది జగన్ కు ప్రజలంటే భయం లేదు. నాపై చర్యలు తీసుకుంటే తీసుకోనివ్వండి మూవ్ చేసేయండి, ఎమ్మెల్యేలందరినీ తీసేయండి. అధికారంలోకి వచ్చిన వైసీపీ అమలు చేయాల్సింది.. భారత రాజ్యాంగమే కానీ, రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు. బూతులు మాట్లాడకపోవడమే నా బలహీనత అనుకుంటే తప్పు.. అదే నా బలం.

Share