డొక్కా మాటను అమల్లో పెట్టేంత దమ్ముందా

తెలుగుదేశం పార్టీ ఏపీలో నైతిక విలువలు, రాజ్యాంగబద్ధ విలువలు అనే ఊసు లేకుండా పాలన సాగిస్తున్న మాట వాస్తవం. కాకపోతే.. ఇప్పుడు వారి నీతి రహిత పోకడలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం వారికి చాలా పెద్ద తప్పుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని చాలా పెద్ద నేరంగా ప్రజల ఎదుట గోబెల్స్ ప్రచారం చేయడానికి తెలుగుదేశం నాయకులు అందరూ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశం లోకి ఫిరాయించి.. అధికార పార్టీ పంచన సేదతీరుతున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీ వారి రాజీనామాల వ్యవహారంలో ఓ అద్భుతమైన సూచన చేశారు. అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. దాన్ని ఆచరిస్తే గానీ.. తెలుగుదేశం పార్టీ తన పతనాన్ని తానే శాసించుకోవడం లాగా చెడ్డపేరు రావడం కుదరదని ప్రజలు అనుకుంటున్నారు. తెలుగుదేశం చేతిలో అధికారం ఉంది గనుక.. వారికి దమ్ముంటే డొక్క సూచనను ఆచరించాలని అంటున్నారు.

ఇంతకూ డొక్కా చెబుతున్నది ఏంటంటే.. సభకు హాజరు కాకుండా బహిష్కరించిన (గైర్హాజరు అయిన) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరి మీద అనర్హత వేటు వేయాలట. సభకు రాకపోవడం వారి విధులను వారు నిర్వర్తించకపోవడం గనుక.. అలాంటి తప్పు చేసినందుకు వెంటనే వారి మీద అనర్హత వేటు వేయవచ్చునట. స్పీకరు అనుమతి లేకుండా వరుసగా సమావేశాలకు రాకపోతే గనుక.. సదరు సభ్యుడి సీటును ఖాళీ అని గుర్తించే అధికారం స్పీకరుకు ఉంటుందిట. దీనికి సంబంధించి రాజ్యాంగంలో 190 వ ఆర్టికల్ అధికారం ఇస్తుందని కూడా డొక్కా చట్టాలను కూడా వెతికి పెట్టి వారికి సలహాలు ఇస్తున్నారు.

అదే రాజ్యాంగంలో పార్టీ ఫిరాయించిన వారి మీద అనర్హత వేటు వేయడం గురించి, పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం గురించి ఏమేం రాశారో కూడా డొక్కా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెబితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. కనీస విలువలు కూడా లేకుండా 21 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం తమలో కలిపేసుకుంటే.. కనీసం ఫిర్యాదులను పరిశీలించి… అనర్హత నిర్ణయం తీసుకునే వ్యవధిలేని స్పీకరుకు గైర్హాజరైన ఎమ్మెల్యేల మీద అనర్హత గురించి సలహాలు ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి పనులు చేస్తే తప్ప.. ప్రభుత్వం దుర్మార్గాలను ప్రజలు మరింతగా అసహ్యించుకోవడం జరగదని పలువురు భావిస్తున్నారు