తూచ్.. నేనలా అన్లేదు: ప్రకాష్ రాజ్

‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ, ఉతికి ఆరేస్తోన్న సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌, నిన్న ఓ బాంబు పేల్చాడంటూ ఓ వార్త గుప్పుమంది. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ప్రకాష్‌రాజ్‌ మీడియాతో మాట్లాడాడు. ఆ సందర్భంలో, ‘సినీ నటులకి ఓటు వేయొద్దని నేను ప్రచారం చేస్తా..’ అని ప్రకాష్‌రాజ్‌ చెప్పాడంటూ, మొత్తంగా అన్ని మీడియా సంస్థలూ ఓ ‘వార్త’ని హైలైట్‌ చేసేశాయి.

తమిళనాట రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, కర్నాటకలో ఉపేంద్ర, తెలుగునాట పవన్‌కళ్యాణ్‌.. ఇలా పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో ‘సత్తా’ చాటేందుకు సమాయత్తమవుతున్న వేళ, ప్రకాష్‌రాజ్‌ వ్యాఖ్యలు ఆయా హీరోల అభిమానుల్ని బాగా హర్ట్‌ చేశాయి. ఇంకేముంది, సోషల్‌ మీడియాలో ప్రకాష్‌రాజ్‌ని ‘ట్రాలింగ్‌’ చేయడం షురూ అయ్యింది.

ఈ వ్యవహారంపై ప్రకాష్‌రాజ్‌, తాజాగా స్పందించాడు. బెంగళూరు ప్రెస్‌ క్లబ్‌కి ఓపెన్‌ లెటర్‌ చేశాడు. ఆ లేఖలో ఫుల్లుగా క్లాస్‌ తీసుకున్నాడు. ‘నన్ను మీరు పిలిచారు, మీరడిగిన ప్రతి ప్రశ్నకూ నేను సమాధానం చెప్పాను. కానీ, నేను చెప్పిందేంటి.? మీరు రాసిందేంటి.? ఇంత బాధ్యతారాహిత్యమా.? నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీదనే వుంది..’ అంటూ ఆ ఓపెన్‌ లెటర్‌లో ప్రకాష్‌రాజ్‌ కడిగి పారేశాడు.

‘సినిమా అభిమానం వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో కావాల్సింది నిబద్ధత. ఆయా వ్యక్తులు రాజకీయాల గురించి ఎలా ఆలోచిస్తున్నారు.? రాజకీయాలపై వారికున్న అవగాహన ఏంటి.? అన్నదానిబట్టే వారికి ఓటెయ్యాలి. కేవలం సినీ అభిమానంతో ఓట్లేయడం సబబు కాదు..’ ఇదీ నేను చెప్పిన విషయం.. అంటూ ప్రకాష్‌రాజ్‌ క్లారిటీ ఇచ్చాడు.